గోపన్‌పల్లిలో హైడ్రాపై స్థానికుల ఆగ్రహం: నాలా పూడ్చివేతపై నిరసన.!
Published on: Wed Sep 30, 2026 3:19PM
.webp)
హైదరాబాద్ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాలను కాపాడేందుకు ఏర్పాటైన హైడ్రానే తమ ప్రాంతంలోని నీటి ప్రవాహ మార్గాన్ని మట్టితో పూడ్చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. గత మూడు నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చి భారీగా డంపింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. వర్షాలు కురిస్తే తమ ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గోపన్‌పల్లి సర్వే నంబర్ 136లోని సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ మట్టి డంపింగ్ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజులు కాదు.. గత మూడు నెలలుగా మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో భారీగా మట్టి పేరుకుపోయిందని, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు మట్టి నింపారని అంటున్నారు.నల్లగండ్ల చెరువులో తవ్విన మట్టిని గోపన్‌పల్లిలోని ప్రభుత్వ భూమిలో డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే మట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్నది తమ ప్రధాన సమస్య కాదని.. చెరువులోకి నీరు వెళ్లాల్సిన నాలా మార్గాన్ని ఎందుకు మూసివేస్తున్నారన్నదే తమ ఆందోళన అని చెబుతున్నారు.

మట్టితో నాలా పూడిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని స్థానికులు అంటున్నారు. సహజంగా నీరు వెళ్లాల్సిన మార్గం మూసుకుపోతే భారీ వర్షాల సమయంలో వరద నీరు ఎటు వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. నాలా పూడిపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోయి తమ ఇళ్ల వైపు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాలను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. తమ ప్రాంతంలో మాత్రం నీరు వెళ్లాల్సిన నాలాను మట్టితో నింపుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ‘హైడ్రా ఉన్నది కాపాడటానికా.. ముంచడానికా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.మట్టి డంపింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి సమస్యను పరిష్కరించాలని కోరితే.. తమపైనే కేసులు పెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు.నాలాకు అడ్డుగా ఉన్న మట్టిని వెంటనే తొలగించాలని, మట్టి డంపింగ్‌ను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సమస్య పరిష్కారం కోసం స్థానికులు ఆందోళన బాట పట్టారు. గోపన్‌పల్లిలో టెంట్ ఏర్పాటు చేసుకుని నిరసన చేపట్టారు. మట్టిని తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మూడు నెలలుగా కొనసాగుతున్న మట్టి డంపింగ్‌ను వెంటనే నిలిపివేసి.. ఇప్పటికే పోసిన మట్టిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.స్థానికుల ఆందోళనకు రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు రాగం సతీష్ యాదవ్, బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్ శంకర్ నాయక్ స్థానికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. నాలా పూడ్చివేతపై స్థానికుల ఆందోళనను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గోపన్‌పల్లిలో మట్టి డంపింగ్ వ్యవహారం, నాలా పూడ్చివేతపై స్థానికుల ఆందోళనతో విషయం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలలుగా కొనసాగుతున్న మట్టి డంపింగ్‌పై, నాలా పూడ్చివేతపై వస్తున్న ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారు? ఇప్పటికే పోసిన మట్టిని తొలగిస్తారా? వర్షాల సమయంలో ముంపు సమస్య తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
[ Gopanpally, HYDRA, HYDRA Hyderabad, Gachibowli, Gopanpally Land, Mud Dumping, Drainage Issue, Nala Encroachment, Nala Closure, Flood Risk, Hyderabad Rains, Gopanpally Protest, Local Residents Protest, Government Land, Nallagandla Lake, Hyderabad Civic Issues, Telugu One, Telugu News ]


