TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బందర్ పోర్టు కేంద్రంగా 8 వేల కోట్ల పెట్టుబడులతో గోవా షిప్ యార్డ్.!

Published on: Tue Sep 8, 2026 12:57PM

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని మ్యారిటైమ్,  రక్షణ రంగ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం  అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మచిలీపట్నం పోర్టు కేంద్రంగా భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్‌యార్డు లిమిటెడ్ (జీఎస్ఎల్) రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మచిలీపట్నం పోర్టు ప్రాంగణంలో అత్యాధునిక షిప్‌యార్డు నిర్మాణాన్ని చేపట్టేందుకు ఈ సంస్థ ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం  8 వేల కోట్ల రూపాయల  పెట్టుబడులతో సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి భూకేటాయింపులు,  ఇతర అనుమతుల ప్రక్రియపై ప్రస్తుతంచర్చలు సాగుతున్నాయి. గోవా షిప్‌యార్డు సంస్థ తన నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటునకు   200 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ భూకేటాయింపు వ్యవహారాన్ని నామినేషన్ పద్ధతిలో కేటాయించాలా లేక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్   విధానాన్ని అనుసరించాలా అనే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

దేశీయంగా రక్షణ రంగ నౌకల తయారీలో విశేష అనుభవం ఉన్న గోవా షిప్‌యార్డు, తన కార్యకలాపాలను తూర్పు తీరానికి విస్తరించేందుకు ఈ ప్రాజెక్టునుప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తూర్పు తీరంలో నౌకల నిర్మాణం, మరమ్మతులు,  ఇతర రక్షణ సంబంధిత సేవలను సులభతరం చేసేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. 

ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ  బ్లూ ఎకానమీ బలోపేతం చేసేందుకు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని  తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇప్పటికే పలు సంస్థలు మారిటైమ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా, తాజాగా గోవా షిప్‌యార్డు వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ మొత్తంతో ప్రవేశించడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఒక మైలురాయిగా నిలవనుంది. 

[Goa Shipyard In Machilipatnam, Machilipatnam Port Shipyard, AP Maritime Investments, Goa Shipyard,  8000 Crore Investment, Andhra Pradesh Defense Hub, Telugu One]