ప్రదర్శన మధ్యలోనే చనిపోయిన విద్వాంసుడు

 

ఆఖరి నిమిషం వరకూ తమ కళని ప్రదర్శిస్తూనే ఉండాలని కొందరు సంగీత విద్వాంసులు చెప్పడం మనం వింటూ ఉంటాం. కర్ణాటకకు చెందిన 74 ఏళ్ల ఎ.వి. ప్రకాష్‌ అనే వేణుగాన విద్యాంసుడు కూడా తరచూ ఇదే మాట అనేవారట. అన్నట్లుగానే ఆయన మైసూరులోని ఒక ఆలయ ప్రాంగణంలో, ప్రదర్శన ఇస్తుండగానే కుప్పకూలిపోయారు. ప్రదర్శనలో ఉండగానే ఎ.వి. ప్రకాష్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో, స్టేజి మీద ఉన్న వాయులీన విద్యాంసుడిని ప్రదర్శన కొనసాగించమని చెబుతూ మరణంలోకి జారుకున్నారు. హసన్‌ జిల్లాకు చెందిన ప్రకాష్‌, తన వేణుగానంతో వేలాది ప్రదర్శనలను నిర్వహించారు. కర్ణాటక తరఫున జాతీయ స్థాయిలోనే గొప్ప సంగీతకారునిగా గుర్తింపుని సాధించడమే కాకుండా, వేయికి పైగా విద్యార్థులకు వేణునాదంలో శిక్షణనిచ్చారు. ఆయన వద్ద ఐదు వందలకు పైగా రకరకాల వేణువుల సేకరణ ఉంది. అందుకే ఆయనను ముద్దుగా ‘ఫ్లూట్‌ ఫ్యాక్టరీ’ అని కూడా పిలిచేవారట. ఇప్పుడు ఆ వేణువులకి నాదాన్ని ఎవరు అందిస్తారు!