TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దీపావళి వేళ టపాసుల శబ్దంపై హెచ్చరిక..చెవులను దెబ్బతీసే శబ్ద తీవ్రత ఎంతంటే.?

Published on: Fri Nov 6, 2026 7:51PM

దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం. అయితే ఆనందాన్ని పంచే ఈ టపాసుల మోతలు మన చెవులపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం టపాసుల శబ్దం నిర్దిష్ట పరిమితిలో ఉండాలని ఉన్నప్పటికీ, ఆ మోతాదు కూడా చెవులకు హానికరమే కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ నిబంధనల ప్రకారం మార్కెట్లో లభించే బాణసంచా గరిష్టంగా 125 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేసేందుకు అనుమతి ఉంది. అయితే చట్టం అనుమతించినంత మాత్రాన ఆ స్థాయి శబ్దం చెవులకు పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా టపాసులు పేలే ప్రాంతానికి అతి సమీపంలో ఉండటం వల్ల వినికిడి శక్తి దెబ్బతినే ముప్పు తీవ్రంగా ఉంటుంది.

సాధారణంగా మనుషులు మాట్లాడుకునే సాధారణ ధ్వని 60 డెసిబుల్స్‌ ఉంటే, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో అది 85 డెసిబుల్స్‌కు చేరుకుంటుంది. కానీ టపాసుల మోత ఏకంగా 125 డెసిబుల్స్‌ వరకు ఉంటుంది. డెసిబుల్స్ పది పాయింట్లు పెరిగినప్పుడు శబ్ద తీవ్రత పది రెట్లు పెరుగుతుందనే నిజాన్ని ఎవరూ విస్మరించకూడదు.

సాధారణంగా బాణసంచా శబ్ద తీవ్రతను నాలుగు మీటర్ల దూరం నుంచి కొలుస్తారు. కానీ పండగ సమయంలో చాలామంది ఆ దూరాన్ని పాటించకుండా టపాసులను చేతులతో పట్టుకుని కాల్చడం లేదా అతి దగ్గరగా నిలబడటం చేస్తుంటారు. దీనివల్ల చెవులపై పడే ఒత్తిడి ఊహించినదాని కంటే ఎక్కువుగా ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పెద్దలకు 140 డెసిబుల్స్‌, పిల్లలకు 120 డెసిబుల్స్‌ మించిన ఆకస్మిక శబ్దాలు అత్యంత ప్రమాదకరం. మనం పేలుడు కేంద్రానికి ఎంత దగ్గరగా ఉంటే శబ్ద తీవ్రత అంతగా పెరుగుతుంది. ఉదాహరణకు నాలుగు మీటర్ల దూరంలో 125 డెసిబుల్స్‌ ఉన్న శబ్దం, అర మీటరు దూరానికి వచ్చేసరికి సుమారు 143 డెసిబుల్స్‌ దాటుతుంది.

మన చెవి లోపల ఉండే సూక్ష్మమైన కణాలు తీవ్రమైన శబ్దాలను తట్టుకోలేవు. బాణసంచా పేలే సమయంలో వచ్చే ఆకస్మిక మరియు తీవ్రమైన శబ్దాల వల్ల కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. లోపలి చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటే అవి మళ్లీ సాధారణ స్థితికి రావు, దీనివల్ల శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇరుకైన వీధుల్లో టపాసులు కాల్చినప్పుడు గోడల వల్ల ప్రతిధ్వని ఏర్పడి శబ్ద తీవ్రత మరింత పెరుగుతుంది. కాబట్టి పండగ వేళ చిన్నారులను దూరంగా ఉంచడం, తగిన చెవి రక్షణ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ అనర్థాల నుంచి రక్షణ పొందవచ్చు.

 

 

 

[ Firecrackers noise decibels, Diwali ear safety precautions, Hearing loss from fireworks, Danger of firecracker noise, Diwali ear precautions, Telugu One, Telugu News ]