TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్రోల్‌కు చెక్.. E100 వాహనాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.!

Published on: Mon Oct 26, 2026 8:54PM

దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగానికి చెక్ పెట్టి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లో (Central Motor Vehicles Rules) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది. దేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) వాహనాల అభివృద్ధికి  వినియోగానికి తగిన విధంగా నిబంధనలను సవరిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ముఖ్యంగా 85 శాతం ఇథనాల్‌తో కూడిన E85తో పాటు ఏకంగా 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచే E100 ఇంధన వాహనాల మార్గం సుగమమైంది.   అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల అస్థిరత, విదేశీ దిగుమతులపై భారమైన భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బ్రెజిల్, అమెరికా వంటి దేశాలలో విజయవంతంగా అమలవుతున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని ఇప్పుడు భారత్‌లోనూ బలోపేతం చేసేందుకు ఆటోమొబైల్ రంగం సిద్ధమవుతోంది. సింగిల్ ఫ్యూయల్ ట్యాంక్ సాయంతో వివిధ రకాల పెట్రోల్-ఇథనాల్ మిశ్రమాలను వాడుకునేలా ఈ ప్రత్యేక వాహనాలను డిజైన్ చేయనున్నారు. 

టయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఇటువంటి అధునాతన ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.అయితే, ప్రస్తుత సాధారణ పెట్రోల్ వాహనాలు లేదా ఈ-20 (E20) ఇంధనానికి పరిమితమైన కార్లలో ఈ హై టెన్షన్ E85 లేదా E100 ఇంధనాన్ని నేరుగా వాడలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ వాహనదారులు ఎవరూ కూడా తమ ప్రస్తుత వెహికల్స్‌ను మార్చుకోవాల్సిన అవసరం గానీ, ఇంధన రకాలను బలవంతంగా మార్చాల్సిన రూల్స్ గానీ ఏవీ లేవని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 

కేవలం ప్రత్యేకంగా ఇంజిన్, ఇంధన సరఫరా వ్యవస్థలను డిజైన్ చేసి సర్టిఫై చేసిన కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మాత్రమే ఈ E100 ఇంధనాన్ని ఉపయోగించడానికి అర్హత కలిగి ఉంటాయి. దీనికి అనుగుణంగానే వాహన ఉద్గార ప్రమాణాలు, సాంకేతిక కొలమానాల్లోని అనెక్చర్ (Annexure S నుంచి Annexure SA) నిబంధనలను కూడా సవరించారు. త్వరలోనే రోడ్లపైకి రానున్న ఈ సరికొత్త ఇథనాల్ ఆధారిత వాహనాలు దేశ హరిత ఇంధన రంగానికి మైలురాయిగా నిలవనున్నాయి.  

 

 

 

 [ E100 vehicles, flex fuel cars India, Ministry of Road Transport, ethanol blended fuel, E85 fuel, Central Motor Vehicles Rules, elugu One, Telugu News ]