ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. రూ.12 లక్షల వ్యవహారంలో కీలక మలుపు..!
Published on: Sun Sep 13, 2026 5:36PM

బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలపై మియాపూర్ పోలీసులు రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసులో తాజాగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేయడంతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మియాపూర్‌లోని ఓ భవనంలో ఆమె బొటిక్ నిర్వహిస్తుండగా, అదే భవనంలోని డ్యాన్స్ స్టూడియోకు రాజు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం తరచూ వచ్చేవాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారిందని బాధితురాలు ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని రాజు నమ్మించాడని, ఆ నమ్మకంతోనే అతడితో సన్నిహితంగా మెలిగానని ఆమె పోలీసులకు తెలిపింది. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రాజు డబ్బులు అడిగేవాడని, అతడి అవసరాల కోసం పలు విడతల్లో ఫోన్‌పే, నగదు రూపంలో సుమారు రూ.12 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పెళ్లి విషయం ప్రస్తావించిన ప్రతిసారీ రాజు ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకునేవాడని, చివరకు పెళ్లికి నిరాకరించడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె ఆరోపించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది..రాజు అరెస్ట్‌తో ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. రాజుతో తనకు ఏర్పడిన పరిచయం, పెళ్లి హామీ, డబ్బుల లావాదేవీలతో పాటు ఇతర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తనను మోసం చేసిన తర్వాత రాజు మరో సీరియల్ నటితో తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపించింది.
అంతేకాకుండా రాజుపై కేసు పెట్టిన తర్వాత తనకు ఆ సీరియల్ నటి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని కూడా ఆమె ఆరోపించింది. రాజుపై తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై సినీ రంగంలోని పెద్దలు స్పందించి న్యాయం చేయాలని కోరుతోంది. ముఖ్యంగా సుమలత, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తనకు అండగా నిలిచి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే అరెస్ట్, రిమాండ్ వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో రూ.12 లక్షల లావాదేవీలు, పెళ్లి పేరుతో చేసినట్లు చెబుతున్న హామీ, మరో నటి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
[ Dhee winner Raju Arest, Sumalatha, Shekhar Master, Johnny Master, Miyapur Police, Telugu Film Dancers Association, Telugu One, Telugu News]


