TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కార్ మాస్టర్ ప్లాన్.!

Published on: Mon Sep 28, 2026 9:31PM

శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ సర్కార్  కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా తలెత్తే తీవ్ర వాయు నాణ్యతా సమస్యలను ముందస్తుగా నివారించే లక్ష్యంతో నవంబర్ 1వ తేదీ నుంచి కఠినమైన ఆంక్షలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి సంవత్సరం శీతాకాలం వచ్చేసరికి ఢిల్లీ నగరం దట్టమైన పొగమంచు, విషపూరిత వాయువులతో గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా అధికారులు ఈ వినూత్న  కఠినమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కేవలం 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నగరంలో విపరీతంగా పెరుగుతున్న వాహనాల రద్దీని, ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రైవేట్  పబ్లిక్ వాహనాల పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రజలు సొంత వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజా రవాణా వైపు మొగ్గు చూపుతారని యంత్రాంగం భావిస్తోంది.ఇక నగరంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భవన నిర్మాణ  కూల్చివేత పనులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఈ శీతాకాల సీజన్ ముగిసే వరకు ఎలాంటి కన్స్రక్షన్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టంగా తేల్చిచెప్పారు.పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాలను దహనం చేయడం, స్థానిక వాహన కాలుష్యం, పారిశ్రామిక ఉద్గారాలు, దీపావళి బాణసంచా వంటి అనేక అంశాలు కలిసి ప్రతిసారీ ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

ఫలితంగా ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.ఈ ముందస్తు ప్లానింగ్ ద్వారా రాబోయే రోజుల్లో కాలుష్య తీవ్రతను కొంతమేరకైనా నియంత్రించవచ్చని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై సామాన్య ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, ప్రజల ఆరోగ్యం  పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ ఆంక్షలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కఠిన చర్యలు ఎంతవరకు సఫలమవుతాయనేది రానున్న శీతాకాల పరిస్థితులే తేల్చనున్నాయి.

 

 

 

[ Delhi air pollution, Delhi government rules, Work from home Delhi, Delhi parking charges hike, Delhi construction ban, Telugu One, Telugu News ]