TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడవాళ్లకే కాదండోయ్.. మగాళ్లకూ గర్బనిరోధక మాత్రలు వచ్చేస్తున్నాయ్.. ఇవెలా పనిచేస్తాయంటే..!

Published on: Tue Nov 3, 2026 5:17PM

వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

 గర్బనిరోధక మాత్రలు..

సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు.

మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది.

పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది.

ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు.

ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు

                            *రూపశ్రీ.