సొంతూరులో కుటుంబంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దసరా సంబురాలు.!
Published on: Tue Oct 20, 2026 6:01PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని ఈ గ్రామానికి సీఎం రాకతో పండుగ సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి చేరుకున్న ఆయన.. స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు.!
కొండారెడ్డిపల్లికి హెలికాప్టర్‌లో చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ దంపతులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు వేద పండితులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. కోట మైసమ్మ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు.
జమ్మి పూజలో పాల్గొనే ఏర్పాట్లు.!
దసరా పండుగలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన జమ్మి పూజ కార్యక్రమాల కోసం గ్రామంలో ఏర్పాట్లు చేశారు. మైసమ్మ ఆలయం వద్ద జరిగే సంప్రదాయ పూజల్లో సీఎం పాల్గొనేలా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాయి.
స్వగ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం.!
పండుగ వేడుకలతో పాటు కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకూ సీఎం ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామంలో ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు సమాచారం. తాజాగా నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థ, సీసీ రోడ్లతో పాటు గ్రామ పంచాయతీ భవనం, లైబ్రరీ, ఇతర కమ్యూనిటీ భవనాలకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామస్థులతో ఆత్మీయ పలకరింపు.!
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ.. తన బాల్యం గడిచిన స్వగ్రామానికి వచ్చిన రేవంత్ రెడ్డి గ్రామస్థులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, బాల్య మిత్రులతో ఆప్యాయంగా ముచ్చటించారు. స్థానిక సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామానికి మెరుగైన రహదారులు, మంచినీటి సౌకర్యం వంటి అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.దసరా పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలో జరుపుకోవడంతో కొండారెడ్డిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, స్వగ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం పర్యటన స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

[ CM Revanth Reddy, Dussehra Celebrations, Kondareddypally, Telangana CM, Nagarkurnool District, Dussehra Festival, Revanth Reddy Family, Anjaneya Swamy Temple, Kota Maisamma Temple, Village Development, Telangana News ]


