TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక రహస్యం.. మరో బాలుడి జీవితాన్ని బలితీసుకుంది.!

Published on: Tue Nov 10, 2026 2:55PM

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. ఇంకా పదో తరగతి చదువుతున్న ఆ బాలుడికి అప్పుడే 15 ఏళ్లు. స్నేహితులతో ఆడుకుంటూ, చదువుకుంటూ సాగాల్సిన బాల్యం.. చివరకు విషాదాంతమైంది. ఒక రహస్యం బయటపడుతుందన్న భయంతో ఆ చిన్నారి ప్రాణాలనే తీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

కల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి, బొనకల్లు మండలానికి చెందిన ఓ వివాహితతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి చనువును అదే ప్రాంతానికి చెందిన మరో 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థి గమనించాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయం నిందితుల్లో మొదలైంది. తమ రహస్యం బయటపెట్టే అవకాశం ఉందని భావించి, ఆ బాలుడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే అక్టోబర్ 21న అత్యంత దారుణానికి ఒడిగట్టారు. కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి ఆ బాలుడికి తాగించారు. కూల్‌డ్రింక్‌ తాగిన కొద్దిసేపటికే బాలుడి గొంతులో తీవ్రమైన మంట మొదలైంది. పరిస్థితి ఏదో తేడాగా ఉందని గుర్తించిన ఆ చిన్నారి వెంటనే ఇంటికి చేరుకుని తండ్రికి జరిగిన విషయాన్ని వివరించాడు. కళ్లముందే విలవిల్లాడుతున్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఎంతగా ఆందోళన చెంది ఉంటారో ఊహించుకోవచ్చు.

కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. ఆ బాలుడి ప్రాణాలను కాపాడలేకపోయారు. దాదాపు 20 రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి ఆదివారం తుదిశ్వాస విడిచాడు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

మృతుడి మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్‌ను వరంగల్ జువెనైల్ జైలుకు, వివాహితను సత్తుపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఒక రహస్యం బయటపడకూడదన్న స్వార్థం.. ఓ అభం శుభం తెలియని బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. నిన్నటివరకు నవ్వుతూ తిరిగిన ఆ ఇంటి బిడ్డ.. ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలిపోయాడు. పదో తరగతి చదువుతూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిన్నారి జీవితం అర్ధంతరంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు మిగిలింది తీరని దుఃఖం మాత్రమే.

ఇది కూడా చదవండి: పవన్ వ్యక్తిగత విషయాలపై టీడీపీ స్పష్టమైన ఆదేశాలు.. రాజకీయాల్లో కొత్త సంప్రదాయం.!

 

 

[ Class 10 student murdered by mixing poison in cool drink, Khammam Crime, Khammam Student Murder, 15 Year Old Student, Class 10 Student, Poisonous Cool Drink, Pesticide Murder, Minor Accused, Married Woman, Secret Relationship, Telangana Crime News, Student Death, Police Investigation, Juvenile Jail ]