TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Flydubai Pilot: స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ గొడ్డలితో దాడి..యూఏఈ నిర్ధారణ.!

Published on: Sat Oct 3, 2026 4:14PM

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు కోటి నజరానా.!

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాక్‌పిట్‌లో ఉన్న గొడ్డలితో కో-పైలట్ పైలట్‌పై దాడి చేసినట్లు యూఏఈ ప్రాసిక్యూటర్లు శనివారం అధికారికంగా నిర్ధారించారు.విమానం కాక్‌పిట్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ‘క్రాష్ యాక్స్’తోనే ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ ఘటనతో విమాన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి బయటపడేందుకు వీలుగా ప్రతి వాణిజ్య విమానంలోనూ క్రాష్ యాక్స్‌ను తప్పనిసరిగా ఉంచుతారు. అయితే, 9/11 ఉగ్రదాడుల తర్వాత భద్రతా కారణాలతో ఈ గొడ్డళ్లను ప్రయాణికుల క్యాబిన్‌ల నుంచి కాక్‌పిట్‌కు తరలించారు.ఇప్పుడు ప్రయాణికుల భద్రత కోసం కాక్‌పిట్‌లో ఉంచిన అదే అత్యవసర పరికరం.. పైలట్‌పై దాడికి ఆయుధంగా మారడం విమానయాన భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు భారీ నజరానా లభించింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కెప్టెన్‌ మచ్చర్‌, ఆయన కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు సంస్థ శనివారం వెల్లడించింది. సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 174 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 27 మంది చిన్నారులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై సహ పైలట్‌ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఈ దాడిలో మచ్చర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. దాదాపు 14 వేల అడుగుల మేర విమానం కేవలం కొన్ని సెకన్లలోనే దిగిపోయినట్లు రాయిటర్స్‌ నివేదించింది. తీవ్రంగా గాయపడి కాక్‌పిట్‌లో నేలపై పడిపోయినప్పటికీ కెప్టెన్‌ మచ్చర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాక్‌పిట్‌ తలుపును తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్‌ పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలోని 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ఘటనలో తన ప్రాణాల కోసం పోరాడుతూనే ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు మచ్చర్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో మాట్లాడి ధైర్యసాహసాలను అభినందించారు. ఆసుపత్రి నుంచి మోదీతో మాట్లాడిన సందర్భంగా మచ్చర్‌ తన అనుభవాన్ని వివరించారు. కెప్టెన్‌ మచ్చర్‌ సాహసాన్ని గుర్తించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ జూనేజా ఆయనకు లేఖ రాశారు. “మీరు చూపిన అసాధారణ ధైర్యం, సంయమనం, బాధ్యతాభావం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తాకింది” అంటూ ప్రశంసించారు. 


ప్రాణాల విలువతో ఏ నగదు బహుమతినీ పోల్చలేమని, రూ.కోటి సాయం కేవలం తమ గౌరవం, కృతజ్ఞతలకు ప్రతీక మాత్రమేనని సంస్థ పేర్కొంది.ఇదిలా ఉండగా, కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు జాతీయ స్థాయి ధైర్య పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆయన సాహసాన్ని గుర్తించి అత్యున్నత ధైర్య పురస్కారానికి పరిగణించాలని రాజ్యసభ సభ్యుడు మిలింద్‌ దేవరా ప్రధాని మోదీకి లేఖ రాశారు.విమానం కూలిపోయే ప్రమాదం నెలకొన్న అత్యంత క్లిష్ట సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరిచి ప్రయాణికులకు లోపలికి వచ్చే అవకాశం కల్పించడం ద్వారా మచ్చర్‌ కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి గుర్తింపుగా మ్యాన్‌కైండ్‌ ఫార్మా ప్రకటించిన రూ.కోటి నజరానా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 

 

[ Captain Smith Match, Flydubai incident, Flydubai FZ1073 flight,  Nina Maneesh, Flydubai news in Telugu, cockpit incident, TeluguOne news, aviation safety, flight emergency news, Hamam Al Hamami, Crash axe attack, UAE aviation safety, Cockpit assault, Telugu News]