TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏఐ నుంచి స్మార్ట్ ఫ్యాక్టరీల వరకు.. బ్రిక్స్ వేదికగా జిన్‌పింగ్ మాస్టర్ ప్లాన్..!

Published on: Sun Sep 13, 2026 4:33PM

బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంచలన ప్రసంగం..!

అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య సంబంధాల వేదికగా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సులో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్రిక్స్ సదస్సులో భాగంగా రెండో రోజైన ఆదివారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ సౌత్ దేశాల మధ్య పరస్పర సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. 

అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసికట్టుగా అడుగులు వేస్తేనే భవిష్యత్తులో ఆర్థికంగా, సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కోసం ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టమైన ప్రతిపాదనలు చేశారు.ఈ ప్రతిపాదనల్లో భాగంగా తొలి అంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేయాలని జిన్‌పింగ్ సూచించారు. ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన ఆయన, ఈ బృహత్తర బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. 

దీని ద్వారా వివిధ దేశాల మధ్య ఏఐ సాంకేతిక అభివృద్ధి, బహుభాషా మోడళ్లకు సంబంధించిన నూతన అప్లికేషన్ల రూపకల్పన, నిపుణుల కోసం ప్రత్యేక సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని ఆయన భరోసా కల్పించారు. ఇక రెండవ ముఖ్యమైన అంశంగా బ్రిక్స్ దేశాల మధ్య స్పెషల్ ఎకనామిక్ జోన్ భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఆయా దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతమై పరస్పర ఆర్థిక వృద్ధికి బలమైన పునాది పడుతుందని ఆయన వివరించారు.

ఇదే కోవలో మూడో అంశంగా డిజిటల్ ఎకో సిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక ప్రత్యేక క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవాలని జిన్‌పింగ్ సలహా ఇచ్చారు. దీని ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యం దక్కుతుందని, యువతకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి సజావుగా సాగుతుందని ఆయన తెలిపారు. ఇక నాల్గవ అంశంగా మారుతున్న కాలానికి అనుగుణంగా తయారీ రంగంలో ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టాలని, స్మార్ట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు తగిన ప్రమాణాలు  విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. 

 

ఐదవ  చివరి అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చైనా తరఫున 'బ్రిక్స్ యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్'ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని జిన్‌పింగ్ చేసిన ఈ ప్రతిపాదనలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

 

 

[ BRICS summit, Xi Jinping, Global South, China president, AI open source, smart factories, BRICS nations, global conflicts, disaster warning system, international news, BRICS summit updates, Global Peace, United Nations, Gaza Ceasefire, Vladimir Putin ]