బ్రిక్స్ అతిథులకు ‘భారత్’ రుచి.. ఢిల్లీ స్టార్ హోటళ్లలో అదిరిపోయే మెనూ..!
Published on: Fri Sep 11, 2026 12:33PM

ప్రపంచ దేశాల నేతలు ఒకే వేదికపైకి రానున్నారు.. కీలక అంశాలపై చర్చించనున్నారు.. దౌత్య సంబంధాలపై మంతనాలు జరపనున్నారు. అయితే ఈసారి బ్రిక్స్ సదస్సుకు వచ్చే విదేశీ అతిథులకు మరో ప్రత్యేక అనుభవం కూడా ఎదురుకానుంది. అదే భారతీయ రుచుల విందు!సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే అధినేతలు, ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీలోని ప్రముఖ స్టార్ హోటళ్లు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ఇందులో భాగంగా అతిథుల కోసం సిద్ధం చేసిన మెనూ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
బ్రిక్స్ అతిథులకు భారతదేశంలోని భిన్న ప్రాంతాల ఆహార వైవిధ్యాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో తాజ్ మహల్ హోటల్ ప్రత్యేక మెనూను సిద్ధం చేసింది. ట్రెడిషన్ టు టేబుల్ పేరుతో రూపొందించిన ఈ ఆహార అనుభవంలో దేశంలోని పలు ప్రాంతాల సంప్రదాయ రుచులు చోటు చేసుకున్నాయి. కశ్మీర్ మసాలా వాల్‌నట్స్ నుంచి పాత ఢిల్లీ మైదా కాజూ వరకు.. మహారాష్ట్ర భాకర్‌వడీ నుంచి రాజస్థాన్ మినీ కచోరీ వరకు.. బెంగాల్ కుచో నిమ్కీ, తమిళనాడు మురుక్కు వంటి ప్రాంతీయ రుచులు కూడా అతిథుల కోసం సిద్ధంగా ఉన్నాయి. అంటే.. ఒకే మెనూలో భారతదేశంలోని భిన్న ప్రాంతాల రుచులను ఆస్వాదించే అవకాశం బ్రిక్స్ ప్రతినిధులకు లభించనుంది.
.webp)
ద లీలా ప్యాలెస్ కూడా బ్రిక్స్ అతిథుల కోసం వినూత్నమైన కాన్సెప్ట్‌ను సిద్ధం చేసింది. భారత జాతీయ పుష్పమైన కమలాన్ని స్ఫూర్తిగా తీసుకుని తినదగిన కమల పుష్పాకార కళాఖండాన్ని రూపొందించారు.
గులాబీ, కుంకుమపువ్వు, యాలకులు, భారతీయ పండ్లను ఉపయోగించి ఈ ప్రత్యేక వంటకాన్ని తయారు చేశారు. రుచి మాత్రమే కాదు.. భారతీయ కళ, సంస్కృతిని కూడా ఆహార రూపంలో చూపించేలా దీనిని తీర్చిదిద్దారు. ఈసారి మెనూలో భారతీయ మిల్లెట్లకూ ప్రత్యేక స్థానం దక్కింది. బజ్రా, జొన్నలు, సత్తు వంటి సంప్రదాయ పదార్థాలతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. మిల్లెట్ కుకీలు, గ్రనోలా బార్లు, వెల్‌నెస్ ఇన్‌ఫ్యూజన్స్ వంటి వాటిని కూడా విదేశీ అతిథులకు అందించనున్నారు.

అంటే.. భారతీయ సంప్రదాయ ఆహారాన్ని ఆధునిక ఆరోగ్యకరమైన ఫుడ్ కాన్సెప్ట్‌తో కలిపి అందించనున్నారు. ద లలిత్ హోటల్ కూడా బ్రిక్స్ ప్రతినిధుల కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేసింది. భారతీయ రుచులకు ప్రాధాన్యం ఇస్తూనే.. అంతర్జాతీయ ఫ్లేవర్‌ను కూడా మెనూలో మేళవించింది.గలౌటీ కబాబ్, తందూర్ రొట్టెలతో పాటు మిల్లెట్ ఆధారిత వంటకాలు అతిథుల కోసం సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో మిసో పేస్ట్‌తో బ్రేజ్డ్ ఎగ్‌ప్లాంట్, సిమ్మర్డ్ చైనీస్ క్యాబేజీ, అంబర్ సాస్‌తో జపనీస్ స్టైల్ కిడ్నీ బీన్ స్వీట్ వంటి అంతర్జాతీయ వంటకాలను కూడా మెనూలో చేర్చారు.
బ్రిక్స్ సదస్సు అంటే కేవలంం దేశాధినేతల సమావేశం మాత్రమే కాదు. ప్రపంచానికి భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసే అవకాశం కూడా. అందుకే ఈసారి ఢిల్లీ స్టార్ హోటళ్ల మెనూలు కూడా ప్రత్యేకంగా మారాయి. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు.. రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకు.. సంప్రదాయ భారతీయ రుచుల నుంచి ఆధునిక అంతర్జాతీయ వంటకాల వరకు.. బ్రిక్స్ అతిథుల ప్లేట్లపై భారత్‌లోని ఆహార వైవిధ్యం దర్శనమివ్వనుంది.మొత్తంగా.. బ్రిక్స్ సదస్సు వేదికగా ప్రపంచ నేతలు కీలక దౌత్య చర్చలు జరుపుతుంటే.. వారి భోజనపు టేబుల్ మాత్రం ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ రుచులను ప్రపంచానికి పరిచయం చేయనుంది!
[ BRICS conference, Delhi, Star hotels, Leela Palace, Rajasthan, BRICS Summit 2026, Global South, Indian Diplomacy, Indian Diplomacy, PM MODI, Telugu One, Telugu News ]


