ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో షాకింగ్ నిజాలు.!
Published on: Tue Oct 13, 2026 12:44PM

హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభం శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు విక్రమ్ కుమార్.. ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి నగరం విడిచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఒకవైపు బీహార్‌కు పారిపోయేందుకు ప్లాన్.. మరోవైపు పోలీసులకు అనుమానం రాకుండా కొత్త ఉద్యోగం కోసం వేట! ఇలా పరారీలో ఉన్న సమయంలోనే నాలుగు ప్రాంతాల్లో తిరిగిన నిందితుడు.. చివరకు పోలీసుల వలకు చిక్కాడు.
డబ్బుల కోసం ఫోన్.. ఆపై బీహార్‌కు పారిపోయే ప్లాన్.!
అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం.. కౌకూర్‌లోని ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియాను హత్య చేసిన అనంతరం విక్రమ్ కుమార్ అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. కౌకూర్ కూరగాయల మార్కెట్ వద్దకు చేరుకున్నాడు. చిన్నారి మృతదేహం రెండు రోజుల వరకు బయటపడదనే అంచనాతో ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.ఆ తర్వాత తన పరారీ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు.

బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలు ఎక్కి తన స్వస్థలమైన బీహార్‌కు పారిపోవాలనేది అతడి ప్లాన్.... కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న విక్రమ్‌కు అక్కడ పోలీసులు చిన్నారి ఫొటోల గాలింపు చర్యలు చేపట్టడాన్ని గమనించి అప్రమత్త మయ్యాడు.అక్కడి నుంచి బీహార్‌కు వెళ్తే పోలీసులకు చిక్కే ప్రమాదం ఉందని భావించి.. వెంటనే తన ప్రణాళిక మార్చుకున్నాడు.రైల్వే స్టేషన్ నుంచి మరో బస్సు ఎక్కి పటాన్‌చెరు వైపు వెళ్లాడు. నగరం విడిచి పారిపోయే ప్రయత్నాన్ని పక్కనపెట్టి, పోలీసులకు అనుమానం రాకుండా కొత్త ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టాడు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు.. ఉద్యోగం కోసం పరుగులు.!
గతంలో పటాన్‌చెరులో పనిచేసిన అనుభవం ఉండటంతో.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడి సెక్యూరిటీ గార్డులను కలిసి ఉద్యోగం కావాలని అడిగాడు. అక్కడి నుంచి క్యాబ్‌లో కూకట్‌పల్లి ఎల్లమ్మబండకు బయలుదేరాడు. మార్గమధ్యలో మల్లంపేట్ వద్ద ఆగి, ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను కలిసి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అనంతరం ఎల్లమ్మబండలోని తన స్నేహితుడు ఉపేందర్ వద్దకు చేరుకున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అక్కడి సెక్యూరిటీ గార్డులతో మాట్లాడుతూ ఉద్యోగం కోసం ఆరా తీశాడు.ఓ చిన్నారి హత్య కేసులో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న నిందితుడు.. మరోవైపు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ఉద్యోగం కోసం ప్రాంతాలు మారుతూ ప్రయత్నాలు కొనసాగించాడు.
బోరబండలో స్నేహితుల గదిలో మకాం.!
ఎల్లమ్మబండ నుంచి బయలుదేరిన విక్రమ్.. ఐడీఎల్ ట్యాంక్ ప్రాంతంలోని వైన్స్ వద్ద మద్యం సేవించాడు. ఆ తర్వాత ఆటోలో బోరబండకు చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితులు ఉంటున్న గదిలో తలదాచుకున్నాడు.సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు.. అక్కడి నుంచి మల్లంపేట్, ఎల్లమ్మబండ.. చివరకు బోరబండ! ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రమ్ కదలికలు సాగాయి. అయితే, నిందితుడు ఎక్కడున్నా వదిలిపెట్టకూడదన్న లక్ష్యంతో పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు.

అద్దె బైక్‌లపై మఫ్టీలో పోలీసులు.. 15 ప్రత్యేక బృందాలతో వేట.!
నిందితుడి ఆచూకీ గుర్తించేందుకు మల్కాజ్‌గిరి పోలీసులు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసు వాహనాల్లో తిరిగితే విక్రమ్ అప్రమత్తమయ్యే అవకాశం ఉండటంతో.. అద్దె బైక్‌లపై మఫ్టీలో నగరవ్యాప్తంగా గాలింపు చేపట్టారు.సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఎల్లమ్మబండలో విక్రమ్ స్నేహితుడు ఉపేందర్‌ను కూడా విచారించారు. విక్రమ్ తన వద్దకు వచ్చినప్పుడు ఏదో తప్పు చేసినట్లు అనుమానించిన ఉపేందర్.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో నిందితుడి కదలికలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు.
బోరబండలో పోలీసుల వల.. పరారీకి తెర.!
చివరకు సీసీటీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో బోరబండలో దాక్కున్న విక్రమ్ కుమార్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. అక్కడ అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడి పరారీ ప్రయత్నాలు, ఉద్యోగం కోసం తిరిగిన ప్రాంతాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. పోలీసుల నుంచి తప్పించుకుని నగరం విడిచి వెళ్లాలని ప్రయత్నించిన ఈ నరరూప రాక్షసుడు విక్రమ్ కుమార్.. చివరకు పోలీసుల వలకు చిక్కాడు. చిన్నారి హత్యకు దారితీసిన పరిస్థితులు, కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
[ Bollaram child murder case, Aurelia Moses, Vikram Kumar, Villa Orchids Bolarum, Gated community crime, Malkajgiri Police, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telugu News, Telugu One ]


