TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Meerut: డ్రమ్ మర్డర్ కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.!

Published on: Wed Oct 14, 2026 7:35PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ 'బ్లూ డ్రమ్' హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మర్చంట్ నేవీ అధికారి అయిన 29 ఏళ్ల సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసుకు సంబంధించి, ఆయన భార్య ముస్కాన్ రస్తోగి  ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు జిల్లా కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. గతేడాది మార్చి 2025లో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనపై మీరట్ జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రా ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసులో మొత్తం 126 విచారణలు జరగగా, 22 మంది ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన బలమైన శాస్త్రీయ మరియు ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా సెప్టెంబర్ 30న నిందిితులు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, తాజాగా వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది.

ఈ ఘోరమైన అపరాధానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్ రస్తోగి దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ముస్కాన్ తన క్లాస్‌మేట్ అయిన సాహిల్ శుక్లాతో వాట్సాప్ ద్వారా తిరిగి పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో సౌరభ్‌ను అంతమొందించాలని వారు పక్కా ప్లాన్ వేశారు. మార్చి 3, 2025న ముస్కాన్ రస్తోగి తన భర్త సౌరభ్‌కు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అతన్ని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశారు. ఎవరికీ ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండటానికి, మృతదేహాన్ని బాత్రూమ్‌లో 15 ముక్కలుగా నరికి, ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కారు. ఆపై ఇసుక, సిమెంట్ కలిపి ఆ డ్రమ్‌లో పోసి పక్కాగా సీలు చేశారు.

ఈ దారుణ హత్య అనంతరం నిందితులు ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా, మాలి ప్రాంతాలకు పారిపోయారు. సౌరభ్ బతికే ఉన్నాడని నమ్మించడానికి ఆయన ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపించి మోసం చేసే ప్రయత్నం చేశారు. అయితే సౌరభ్ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మార్చి 17న పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా, సిమెంట్ డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో శవం బయటపడింది. రెండు రోజుల తర్వాత మార్చి 19న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మహాభారతాన్ని ప్రస్తావిస్తూ, శిక్ష అనేది కూడా ఒక రూపంలో ధర్మమేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి భయానక నేరాలు సమాజంలో తీవ్ర భయాన్ని, అభద్రతాభావాన్ని సృష్టిస్తాయని కోర్టు పేర్కొంది. హతుడు సౌరభ్ చాలా మంచివాడని, దోషులకు మరణశిక్ష విధిస్తే తాము ఎటువంటి నిరసన తెలపబోమని ముస్కాన్ తల్లిదండ్రులే స్వయంగా కోర్టుకు వెల్లడించడం గమనార్హం. ఈ తీర్పుతో మీరట్ కోర్టు వెలుపల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు.

 

 

 

[ Blue drum murder case, Meerut news, Muskan sahil death sentence, Saurabh rajput case, UP crime news, Court verdict, Sahil Shukla, Saurabh Rajput murder, Navy officer murder verdict, UP CM Yogi ]