నా కొడుకుని ఉరితీయండి: అత్యాచార కేసులో నిందితుడు తల్లి సంచలన డిమాండ్.!
Published on: Fri Sep 25, 2026 8:25PM

మహారాష్ట్రలోని ఠాణే జిల్లా భీవండి ప్రాంతంలో వెలుగుచూసిన దారుణమైన అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సస్పెండెడ్ కానిస్టేబుల్ వ్యవహారశైలిపై సొంత తల్లే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కన్న కొడుకే ఒక వివాహితపై అఘాయిత్యానికి పాల్పడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.తన కుమారుడిపై గతంలోనూ పలువురు మహిళలను వేధించిన ఆరోపణలు ఉన్నాయని అతడి తల్లి మీడియా ముందు ఆరోపించారు. అతడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకుని తనను కూడా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఠాణే జిల్లా భీవండిలో సెప్టెంబర్ 13న ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ శైలేష్ పాటిల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ నిందితులుగా ఉన్నారు. బాధితురాలిని తుపాకీతో బెదిరించి, బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసును ఇటీవల విచారించిన స్థానిక న్యాయస్థానం.. మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు, సహ నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ శైలేష్ పాటిల్‌ను పోలీసు శాఖ ఇప్పటికే విధుల నుంచి తొలగించింది.ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలి వాంగ్మూలం, నిందితులపై ఉన్న ఆరోపణలు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.ఈ దారుణ ఉదంతంలో కళ్యాణ్ వెస్ట్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ తో పాటు సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ శైలేష్ పాటిల్ కూడా నిందితుడిగా ఉన్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఒక వివాహితను భివండిలోని బాప్‌గావ్‌కు బలవంతంగా తీసుకెళ్లి, తుపాకితో బెదిరించి, మద్యం తాగించి ఈ అకృత్యానికి పాల్పడినట్లు వారిపై తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి.

అయితే, తన కుమారుడి నేర ప్రవృత్తి ఒక్క భీవండి ఘటనతోనే మొదలుకాలేదని తల్లి సులోచన వెల్లడించారు. గతంలోనూ అతడు పలువురు మహిళలను బెదిరింపులకు గురిచేసి వేధించాడని తెలిపారు. అంతేకాకుండా, గన్ చూపించి తనను సైతం భయభ్రాంతులకు గురిచేశాడని, తన ఆస్తులన్నింటినీ బలవంతంగా లాక్కుని రోడ్డున పడేశాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం తాను కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు వాపోయారు.కొడుకు ఈ స్థాయికి దిగజారడానికి జైలు జీవితమే కారణమని తల్లి వివరించారు. గతంలో ఒక ఐపీఎస్ అధికారిని రక్షించే ప్రయత్నంలో భాగంగా శైలేష్ తనపై తప్పుడు కేసు వేయించుకుని జైలుకు వెళ్లాడని తెలిపారు. ఆర్థర్ రోడ్ జైలులో గడిపిన సమయంలో అక్కడ పరిచయమైన కరడుగట్టిన నేరస్థుల సావాసం కారణంగానే అతడి ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో ఇలాంటి మృగాళ్లకు జీవించే హక్కు లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ అతడికి ఉరిశిక్షను ఖరారు చేయాలని సులోచనా పాటిల్ కోరారు. అలాగే, ఫోర్జరీ పత్రాల ద్వారా తన కుమారుడు అక్రమంగా కైవసం చేసుకున్న ఆస్తులన్నింటిని తిరిగి తనకు ఇప్పించాలని ఆమె ప్రభుత్వానికి మరియు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ఇప్పటికే సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తుండగా, సొంత తల్లే నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు బయటపెట్టడం కేసును కీలక మలుపు తిప్పింది. ప్రజాప్రతినిధులు, పోలీసు విభాగాలకు చెందిన వ్యక్తులు ఇలాంటి తీవ్రమైన నేరాల్లో భాగస్వాములు కావడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
[ Bhiwandi rape case, Suspended constable Shailesh Patil, Thane crime news, Mother demands death penalty, Maharashtra news, Thane Bhiwandi rape case, Suspended constable Shailesh Patil, Maharashtra crime news ]


