TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.!

Published on: Wed Aug 26, 2026 12:40PM

ఆంధ్రప్రదేశ్ లో  బీసీల రాజకీయ ప్రాతినిధ్యం 34 శాతం ఉండేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి సవిత  విస్పష్టంగా చెప్పారు.   అమరావతిలో  మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత , తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బీసీల రాజకీయ అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు.  చట్ట, రాజకీయ అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి  మాట నిలుపుకుంటామన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు మొట్టమొదటిసారిగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించినది ఎన్టీఆర్ హయాంలోనే అని గుర్తు చేసిన మంత్రి సవిత..   ఆ తర్వాత ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్ల పరిమితిని 34 శాతానికి పెంచారని వివరించారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే 34 శాతం రిజర్వేషన్ల ఆధారంగా విజయవంతంగా సాగాయన్న ఆమె.. అయితే జగన్ హయాంలో  బీసీలకు  అన్యాయం జరిగిందన్నారు.

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పటి జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి   24 శాతానికి కుదించిందని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల800 మంది బీసీ నాయకులు తమ పదవులు, రాజకీయ అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని గణాంకాలతో  వివరించారు.  

గత పాలనలోని అవినీతి మరియు అక్రమార్జన చర్యల వల్ల బీసీ నాయకులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో బీసీ నాయకులకు వివిధ రకాల పదవులు ఆశ చూపి, వారిని పావులుగా వాడుకున్నారని విమర్శించారు. అక్రమ మద్యం తయారీ, సరిహద్దుల దాటి మద్యం రవాణా, మరియు ఇసుక అక్రమ తవ్వకాలు వంటి అనేక కేసులలో బీసీ నేతలను ఇరికించారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ధన దాహానికి, అవినీతికి ప్రాతినిధ్యం వహించినందుకు బీసీ నేతలు ఈ రకమైన కేసుల్లో చిక్కుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు.

రాష్ట్రంలోని బీసీల భద్రత మరియు సమగ్ర వికాసం కోసం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి సవిత తెలిపారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించకుండా, వారి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే ప్రత్యేకంగా 'బీసీ రక్షణ చట్టం' తీసుకువస్తున్నామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా, వారి అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

 BC Reservations in AP local body elections,  34 Percent, Savitha Minister, AP Local Body Elections Reservations,  CBN  BC Welfare, AP Politics, TeluguOne