TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Asian Games: శ్రీలంకను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.!

Published on: Thu Oct 1, 2026 2:34PM

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌లోకి ప్రవేశించింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన హైవోల్టేజ్ సెమీఫైనల్ పోరులో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా, స్వర్ణ పతకం ముంగిట నిలిచింది.ఈ కీలక పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 21 బంతుల్లోనే 38 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అంచనాలకు తగ్గట్టుగానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అతను కేవలం 46 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 బాంబులాంటి సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు బాదాడు.క్లిష్టమైన పిచ్‌ పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. మిగతా బ్యాటర్లు తక్కువ పరుగులకే వెనుదిరిగినా, కిషన్ బాధ్యతాయుతమైన ఆటతో గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచాడు.

అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి పూర్తిగా విలవిలలాడింది. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ఎదుట నిలవలేక ఆ జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించి తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరు కట్టడి చేసిన తీరుకు లంక బ్యాటర్లు ఎక్కడా కోలుకునే అవకాశం లేకుండా పోయింది.

ఈ భారీ విజయంతో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం కోసం తలపడే తుది పోరుకు టీమిండియా సిద్ధమైంది. శనివారం జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. దక్షిణాసియాలోని రెండు అత్యుత్తమ జట్లు టైటిల్ పోరులో తలపడుతుండటంతో క్రీడా ప్రేమికుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ మహా సమరంలో గెలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకోవాలని భారత అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

 

 

 

[ Asian Games Cricket Final 2026, India vs Pakistan Cricket Asian Games, ishan Kishan, Indian Cricket Team, Asian Games, Asian Games Cricket, Asian Games Gold Medal Match ]