ఆసియా క్రీడల్లో పసిడి జోరు: భారత్‌కు ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్.!
Published on: Wed Sep 30, 2026 5:29PM

పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆర్చర్ చికితా సంచలనం..!
ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆర్చరీలో తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితా అద్భుత ప్రదర్శనతో ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి దేశాన్ని గర్వపడేలా చేసింది. మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో చికితా పసిడి పతకాలను కైవసం చేసుకుంది.పెద్దపల్లి జిల్లాకు చెందిన చికితా.. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, పృథిక ప్రదీప్‌తో కలిసి స్వర్ణం సాధించింది. అనంతరం మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సాహిల్ జాదవ్‌తో కలిసి మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కొరియాతో జరిగిన ఫైనల్లో స్కోరు 157-157తో సమం కావడంతో షూట్‌ఆఫ్‌కు వెళ్లిన పోరులో భారత జోడీ విజయం సాధించింది. ఈ విజయంతో 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్‌కు తొలి కోటా స్థానం కూడా లభించింది.

చికితా ఘనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆమె పట్టుదల, నిరంతర సాధన, దృఢ సంకల్పం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చికితా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, శిక్షణ అందించిన కోచ్‌లను కూడా సీఎం అభినందించారు.మరోవైపు రెజ్లింగ్‌లోనూ భారత్‌కు పతకం లభించింది. పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో ఈ ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.సునీల్ కుమార్‌కు ఆసియా క్రీడల్లో ఇది వరుసగా రెండో కాంస్య పతకం. 2022 ఆసియా క్రీడల్లోనూ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో నడుము కింది భాగాన్ని ఉపయోగించకుండా పోరాడటం ఈ విభాగం ప్రత్యేకత.

ఇక అథ్లెటిక్స్, షూటింగ్‌లోనూ భారత్ ఇప్పటికే సత్తా చాటింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో కిరణ్ పహల్, ఎం.ఆర్. పూవమ్మ, ప్రాచీ, విథ్యా రామరాజ్‌తో కూడిన భారత జట్టు స్వర్ణం సాధించింది. 3 నిమిషాల 29.69 సెకన్లలో రేసును పూర్తి చేసి బంగారు పతకాన్ని అందుకుంది. షూటింగ్‌లో నీరూ ధాండా మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విభాగంలో ఆసియా క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్‌గా నిలిచింది. ఇలా ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్‌తో పాటు బాక్సింగ్, క్రికెట్, హాకీ వంటి విభాగాల్లోనూ భారత్ పతకాల ఆశలు కొనసాగుతున్నాయి. కీలక దశలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆసియా క్రీడల వేదికపై భారత క్రీడాకారుల వరుస విజయాలు దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా చికితా తానిపర్తి రెండు స్వర్ణాలతో మెరవడం తెలంగాణ క్రీడా రంగానికి ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది.
[ Asian Games 2026, India Gold Medals, Chikitha Taniparthi, Chikitha Taniparthi Gold Medal, Indian Archery, Compound Archery, Mixed Team Archery, Telangana Archer, Sahil Jadhav, Sunil Kumar, Indian Wrestling, Indian Sports, Asian Games India, Sports News, India Medal Tally ]


