ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం. !
Published on: Sat Oct 10, 2026 3:35PM
.webp)
నవంబర్ 15లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి.. ముఖ్యమంత్రి ఆదేశాలు.!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్రంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందడుగు వేసింది. పంచాయతీల నుంచి నగరపాలక సంస్థల వరకు అన్ని స్థాయిల్లోనూ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు సుదీర్ఘంగా చర్చించారు. రాజీవ్ రంజన్ కమిషన్ అందించిన సమగ్ర నివేదికను ఆధారంగా చేసుకుని, రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు దక్కాల్సిన వాటాను ప్రభుత్వం శాస్త్రీయంగా నిర్ధారించింది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లతో పాటు మున్సిపల్ వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్ పదవులు.. ఇలా మొత్తం ఎనిమిది ప్రధాన కేటగిరీల్లో రిజర్వేషన్లను స్పష్టంగా విభజించారు.

ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. వివిధ స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన శాతాలను పరిశీలిస్తే.. పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, సర్పంచ్ స్థానాలకు 27.95 శాతం మేర కోటా దక్కనుంది. అదేవిధంగా, మండల జిల్లా పరిషత్ స్థానాల్లోనూ బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. ఎంపీటీసీ స్థానాలకు 25.55 శాతం, ఎంపీపీ మరియు జడ్పీటీసీ స్థానాలకు 24.60 శాతం చొప్పున, అలాగే జడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు 23.08 శాతం మేర రిజర్వేషన్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లోనూ బీసీలకు పెద్దపీట వేస్తూ అర్బన్ వార్డు సభ్యులకు 32.78 శాతం రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని మంత్రులకు సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏ ఒక్క స్థానం ఓడిపోవడానికి వీలులేదని.. 100 శాతం స్థానాలు గెలుచుకొని తీరాల్సిందే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్త నాయకత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు.
పట్టణ స్థానిక సంస్థల ఉన్నత పదవులైన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాల్లో 32.03 శాతం, మేయర్ స్థానాల్లో ఏకంగా 35.02 శాతం మేర బీసీలకు కేటాయించడం విశేషం. ఈ కేటాయింపుల ద్వారా బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం లభిస్తుందని పాలకవర్గం భావిస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి కావడంతో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల లెక్కల ఆధారంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
[ AP local body elections, BC reservations AP, AP Cabinet decisions, CM Chandrababu Naidu, Rajeev Ranjan Commission, Andhra Pradesh news, local polls quota, Nara lokesh, Telugu One, Telugu News ]


