AP: 807 మద్యం దుకాణాలకు లాటరీ.. అక్టోబర్ 5న డ్రా.!
Published on: Fri Sep 25, 2026 7:34PM

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ పాలసీ ప్రకారం 807 ఏ4 మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కేటాయించేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. దీనికి సంబంధించిన జిల్లా గెజిట్ నోటిఫికేషన్లను సెప్టెంబర్ 24న విడుదల చేసి.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా తాజా కేటాయింపుల కోసం 807 మద్యం దుకాణాలను గుర్తించారు. వీటిలో 799 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉండగా.. 8 దుకాణాలను రిజర్వుడ్ కేటగిరీకి కేటాయించారు. గతంలో పునరుద్ధరణ జరగని లేదా ప్రస్తుతం పనిచేయని దుకాణాల స్థానంలో కొత్త లైసెన్సులు జారీ చేయనున్నారు.
అర్హత కలిగిన వారు అక్టోబర్ 1 అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్, హైబ్రిడ్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 21 ఏళ్లు నిండిన, నిబంధనల ప్రకారం అనర్హత లేని వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవడంతో పాటు.. ఒక్కో దుకాణానికి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా సమర్పించవచ్చు.ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తుదారులు ఏపీ ఎక్సైజ్ చట్టం–1968, 2024 నాటి సంబంధిత నిబంధనలు, 2026–27 ఎక్సైజ్ పాలసీతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చినప్పుడే లాటరీ నిర్వహిస్తారు. నాలుగు దరఖాస్తులు రాని దుకాణాలకు గడువు పొడిగించే అవకాశం ఉంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు సంబంధిత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు హాజరైనా.. హాజరు కాకపోయినా డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపికైన వారికి అదే రోజు సమాచారం అందిస్తారు.
లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులు అవసరమైన చట్టపరమైన, నియంత్రణపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం ఫారం–ఏ4 లైసెన్స్ పొందాలి. సవరించిన రూల్–14 ప్రకారం దుకాణాన్ని ఏర్పాటు చేసి నిర్వహించేందుకు పెర్మిట్ రూమ్ లైసెన్స్ పొందడం తప్పనిసరి.వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET)ను ఒకేసారి లేదా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. వాయిదా విధానాన్ని ఎంచుకున్న వారు ఎంపికైన రోజున లేదా తదుపరి బ్యాంకు పనిదినంలో తొలి వాయిదా చెల్లించాలి.
జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 39, విజయనగరంలో 30, పార్వతీపురం మన్యంలో 9, విశాఖపట్నంలో 52, అనకాపల్లిలో 39, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, కాకినాడలో 38, కోనసీమలో 12, తూర్పుగోదావరిలో 4, పోలవరంలో 1, ఏలూరులో 19, పశ్చిమగోదావరిలో 25, కృష్ణాలో 35, ఎన్టీఆర్ జిల్లాలో 18, గుంటూరులో 49, పల్నాడులో 24, బాపట్లలో 34, ప్రకాశంలో 45, మార్కాపురంలో 21, ఎస్‌పీఎస్ నెల్లూరులో 51, చిత్తూరులో 19, తిరుపతిలో 49, కర్నూలులో 17, నంద్యాలలో 27, అనంతపురంలో 53, శ్రీ సత్యసాయి జిల్లాలో 17, అన్నమయ్యలో 17, వైఎస్సార్ కడపలో 60 దుకాణాలను కేటాయించనున్నారు.
రిజర్వుడ్ కేటగిరీలో చిత్తూరులో 1, నంద్యాలలో 1, అనంతపురంలో 3, వైఎస్సార్ కడపలో 3 దుకాణాలు ఉన్నాయి. మిగిలిన 799 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దుకాణాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఫీజులు, అవసరమైన పత్రాలు, గడువులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ చామకూరి శ్రీధర్ సూచించారు.
[ AP Liquor Shops, Andhra Pradesh Excise Policy, 807 Liquor Shops, Liquor Shop Lottery, AP Liquor Lottery 2026, Excise Department AP, A4 Liquor Shops, AP Excise License, Liquor Shop Applications, October 5 Lottery ]


