Local Body Elections: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.!
Published on: Sun Oct 11, 2026 11:19AM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించింది. అంతేకాకుండా, కూటమి పార్టీల తరఫున అదనపు అవకాశాలు కల్పించడం ద్వారా మొత్తంగా 34 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, సంధ్యారాణి, అనిత, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు ఈ వివరాలను వెల్లడించారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల వారీగా బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు పేర్కొన్నారు.
ఏడు నెలల పాటు కమిషన్ అధ్యయనం.!
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు, తీర్పులను దృష్టిలో ఉంచుకుని విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రులు వివరించారు. ఈ కమిషన్ ఏడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వివిధ సామాజిక వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఆ వివరాలను విశ్లేషించి స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై నివేదిక సమర్పించింది. ఈ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసే విధానాన్ని కమిషన్ సూచించింది. ఆయా పదవులకు సంబంధించిన స్థానిక సంస్థలను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై టీడీపీ వాదన.!
గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిందని మంత్రులు గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1995లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఈ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచినట్లు వివరించారు. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు.
గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొన్నాయని తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఆ దిశగా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీనివల్ల బీసీలు స్థానిక సంస్థల్లో వేలాది పదవులను కోల్పోయారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం చేతుల్లోకి ప్రక్రియ.!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించామని, తదుపరి చర్యలు ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మిగిలిన స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు.

కొన్ని ప్రాంతాల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్ల వాటా తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ, కూటమి పార్టీల తరఫున అదనపు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.మొత్తంగా, డెడికేటెడ్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు, ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఎన్నికల తేదీలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
[ AP Local Body Elections, BC Reservations, Panchayat Elections, Municipal Elections, Andhra Pradesh Government, CM Chandrababu, AP BC Quota, Telugu One, Telugu News ]


