ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ కేంద్రంలో టీచర్ దుర్మరణం.!
Published on: Thu Nov 5, 2026 4:46PM

హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
అనంతపురం జిల్లాలో ఎన్నికల విధులు విషాదాన్ని నింపాయి. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా పోలింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు వచ్చిన ఓ ఉపాధ్యాయురాలు.. విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన హరిత గౌడ్ (58) మృతి చెందడంతో తోటి ఎన్నికల సిబ్బంది, ఉపాధ్యాయ వర్గాల్లో విషాదం నెలకొంది.
గుంతకల్లుకు చెందిన హరిత గౌడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆమెకు కూడేరు మండలం కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో బాధ్యతలు అప్పగించారు. గురువారం ఉదయం విధుల్లో ఉన్న సమయంలో ఆమెకు బీపీ, షుగర్ స్థాయిలు తగ్గడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు, ఆయాసం మొదలయ్యాయి.
దీంతో తన ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి వెళ్లాలని అక్కడే ఉన్న తోటి సిబ్బందికి తెలిపారు.అయితే ఆసుపత్రికి వెళ్లేందుకు అవసరమైన అనుమతి కోసం వేచి చూస్తుండగానే హరిత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న ఎన్నికల సిబ్బంది వెంటనే స్పందించి వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించారు.
అనంతరం ఆమెను కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు హరిత తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.ఎన్నికల విధుల్లో ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న సహోద్యోగి ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో తోటి సిబ్బంది కన్నీరుమున్నీరయ్యారు.

కుటుంబ సభ్యులకు తీరని విషాదంమిగిల్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మరోవైపు పోలింగ్ అధికారి హరిత మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇవి చదవండి: https://teluguone.com/news/content/winter-health-tips-25-236401.html
[ Anantapur News, Polling Officer Haritha Death, Election Duty Death, Andhra Pradesh Elections, Kuderu News, Chandrababu Naidu, Teacher Death, Polling Duty Tragedy ]


