ప్రియుడిని నమ్మి వెళ్లింది: చివరకు శవమై తిరిగొచ్చింది.!
Published on: Sun Oct 4, 2026 11:48AM

నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
మూడు ముళ్లు, ఏడడుగుల బంధం ఇప్పటికే ఆమె జీవితంలో విషాదంగా ముగిసింది. భర్తను కోల్పోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటున్న ఆ మహిళకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను ప్రేమిస్తున్నాడని నమ్మిన ఆమె.. అతడినే నమ్ముకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ అదే వ్యక్తి చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. నగలు కోసం మొదలైన ఒత్తిడి.. చివరకు హత్యకు దారితీసింది. అదృశ్యమైన మహిళ కోసం కుటుంబ సభ్యులు చేసిన గాలింపు.. చివరకు ఆమె విగతజీవిగా కనిపించడంతో విషాదాంతమైంది.
.webp)
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. చెల్లాపూర్ గ్రామానికి చెందిన అమృతమ్మ (34)కు కుల్కచర్లకు చెందిన గంధం భీమయ్యతో పెళ్లి జరిగింది. అయితే రెండేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. అప్పుడప్పుడూ కుల్కచర్లలోని అత్తవారింటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మంగలి ఆనంద్ (28)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.
ఇల్లు చూసి వస్తానని వెళ్లి..!
సెప్టెంబర్ 18న కుల్కచర్లలోని ఇల్లు చూసి వస్తానని చెప్పి అమృతమ్మ చెల్లాపూర్ నుంచి బయలుదేరింది. కానీ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. ఒకరోజు.. రెండు రోజులు.. ఇలా మూడు రోజులు గడిచినా ఆమె ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసినవారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో సెప్టెంబర్ 29న కుల్కచర్ల పోలీసులను ఆశ్రయించారు.అదృశ్యం కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. అమృతమ్మతో సన్నిహితంగా ఉన్న పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో మంగలి ఆనంద్‌పై అనుమానం బలపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అమృతమ్మ హత్యకు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
.webp)
ఆభరణాల కోసం హత్య..!
ఆనంద్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో అమృతమ్మ అతడి అవసరాల కోసం బంగారు, వెండి ఆభరణాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాటిని తనఖా పెట్టిన ఆనంద్.. సుమారు రూ.2 లక్షలు తీసుకుని ఖర్చు చేశాడు. అయితే తన నగలు తిరిగి ఇవ్వాలని అమృతమ్మ పదేపదే అడగడం ప్రారంభించింది. దీంతో తన గుట్టు బయటపడుతుందనే భయంతో ఆమెను హత్య చేయాలని ఆనంద్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.సెప్టెంబర్ 18న కొత్తపల్లి వద్ద అమృతమ్మను కారులో ఎక్కించుకున్న ఆనంద్.. మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం వెన్నాచెడ్ చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చీర కొంగుతో ఆమె మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య తర్వాత ఆధారాల మాయం కోసం..!
అమృతమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం ముందుగా తీసుకొచ్చిన డీజిల్‌ను మృతదేహంపై పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో భయాందోళనకు గురైన ఆనంద్.. మృతదేహాన్ని మూటకట్టి కారులో తరలించాడు.తెలంగాణ-కర్ణాటక సరిహద్దు వైపు, రాయచూర్ మార్గంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని పడేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించారు. ప్రియుడిని నమ్మి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమృతమ్మ.. చివరకు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పిల్లలను, కుటుంబాన్ని ఒంటరిగా వదిలి వెళ్లిన ఆమె.. తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అదృశ్యమైన మహిళ కోసం మొదలైన గాలింపు.. చివరకు హత్య కేసు ఛేదనకు దారితీసింది. కుల్కచర్ల పోలీసులు నిందితుడు ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
.webp)
[ Amruthamma Murder, Kulkarla Murder Case, Vikarabad Crime, Telangana Crime, Woman Murder, Missing Woman Case, Lover Murder, Extramarital Affair, Mangali Anand, Kulkarla Police, Vikarabad Murder Case, Telangana Woman Murder, Crime News, Murder Investigation, Missing Woman Turns Murder Case ]


