నేను ముసలోడిని అయిపోయాను: పోటీ చేయాలనే ఆలోచన లేదు.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.!
Published on: Sat Oct 3, 2026 7:16PM

పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. బండ్లగూడలోని ఫాతిమా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ తన రాజకీయ ప్రస్థానం, విద్యాభ్యాసం గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన వయస్సును ప్రస్తావిస్తూ.. “నేను ముసలోడిని అయిపోయాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అసలు పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ వ్యాఖ్యానించారు. అదే కార్యక్రమంలో తన విద్యాభ్యాసం గురించి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. అయితే రాజకీయాల్లో తాను ఎదిగిన తీరును ప్రస్తావిస్తూ.. “నేను 12వ తరగతి చదువుకున్నాను.. కానీ నేను ఏం చెప్పినా దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాను” అని పేర్కొన్నారు. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకుంటూ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని వివరించారు. అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎంఐఎం అధికారిక వివరాల ప్రకారం, ఆయన 1999 నుంచి చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఆ తర్వాత కూడా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
.webp)
పాతబస్తీలో ఎంఐఎం రాజకీయాల్లో అక్బరుద్దీన్ ఓవైసీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. గతంలోనూ వివిధ ఎన్నికల సందర్భాల్లో ఎంఐఎం తరఫున ఆయన కీలకంగా వ్యవహరించారు. 2026లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అసలు చర్చ అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో నిజంగానే పోటీకి దూరంగా ఉంటారా? అన్నదే. ఒకవేళ ఆయన ఎన్నికల బరిలోకి దిగకపోతే చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం ఎవరిని బరిలోకి దింపుతుంది? కొత్త తరానికి అవకాశం ఇస్తుందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే “వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ స్వయంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు ఆయన రాజకీయ వారసత్వం, మరోవైపు కొత్త తరానికి అవకాశాలపై చర్చ మొదలవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చాంద్రాయణగుట్ట రాజకీయాలు ఎలా మారతాయన్న ఆసక్తి నెలకొంది.
.webp)
[ Akbaruddin Owaisi, AIMIM Party, Chandrayangutta Constituency, Asaduddin Owaisi, old city, CM Revanth reddy, Telangana Assembly, GHMCElections,Telugu News, Telugu One ]


