విమానంలోనే అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేసిన పోలీసులు. !
Published on: Sat Oct 10, 2026 11:32AM
.webp)
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.జంతర్ మంతర్ వద్ద నిరసనలు నిర్వహించేందుకు సీజేపీ నాయకత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనతో దిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాలపై ఉత్కంఠ నెలకొంది.
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధృవ్ రాఠీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానాలోని గురుగ్రామ్ సెక్టార్ 56లో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు శనివారం ఉదయం ఈ నిర్బంధ చర్యలు చేపట్టారు. ఓటర్ల జాబితాలో తప్పులు, అవకతవకలపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు ముందుస్తుగా కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా, ఎక్కడికక్కడ వందలాది మంది ఆందోళనకారులను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 150 మందికి పైగా ప్రదర్శనకారులను పోలీసులు వివిధ ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసన ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ధృవ్ రాఠీ ప్రజలను పెద్ద ఎత్తున తరలిరావాలని కోరడంతో ఉద్రిక్తత మరింత తారాస్థాయికి చేరింది. ఢిల్లీలో సెక్షన్ 163 (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత) అమల్లో ఉందని, ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నప్పటికీ, రాఠీ తగ్గేదేలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.

ఈ నేపథ్యంలో గురుగ్రామ్ పోలీసులు సాదాసీదా దుస్తులలో వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ధృవ్ రాఠీ నిర్బంధాన్ని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని CJP మండిపడింది. యువత ప్రశ్నించే తత్వాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, ధృవ్ రాఠీతో పాటు అదుపులోకి తీసుకున్న విద్యార్థి కార్యకర్తలు, పౌరులందరినీ ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని వారు అధికారికంగా డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు.
[ Abhijeet Deepke, Dhruv Rathee detained, Delhi Police, CJP protest, Jantar Mantar, Gurugram news, Indian YouTuber arrest, Cockroach Janata Party, Delhi protest, Jantar Mantar security, Chief Election Commissioner, Delhi Metro closures ]


