సత్తా చాటిన తెలుగు చిత్రాలు: ఘనంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం..!
Published on: Tue Sep 22, 2026 9:37PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. దేశ రాజధాని వెలుపల తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుక 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని చాటుతూ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో దేశరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిగ్గజ నటులు, దర్శకులు సాంకేతిక నిపుణులు తమ పురస్కారాలను అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో విశేష సేవలందించినందుకు గాను ప్రముఖ దిగ్గజ నటుడు అనంత నాగ్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుని అందరి ప్రశంసలు పొందారు.

ఉత్తమ నటుడిగా సంయుక్తంగా ఇద్దరు దిగ్గజ నటులు ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. 'చందూ ఛాంపియన్' చిత్రంలోని అద్భుతమైన నటనకు గాను కార్తీక్ ఆర్యన్, అలాగే 'భ్రమయుగం' చిత్రంలో విలక్షణ నటనతో మెప్పించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా సంయుక్తంగా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి తన విజయంతో అందరి అభినందనలు అందుకుంటూ స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్ పొందారు. ఇక ఉత్తమ నటి విషయానికి వస్తే, 'ఆర్టికల్ 370' చిత్రంలో అసాధారణ అభినయాన్ని ప్రదర్శించిన యామీ గౌతమ్ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అలాగే ఇదే చిత్రం ఉత్తమ చలన చిత్రంగా ఆర్టికల్ 370గా నిలవడం విశేషం.
దర్శకత్వం సాంకేతిక విభాగాల్లోనూ పలు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. 'అమరన్' చిత్రానికి గాను రాజ్‌కుమార్ పెరిసామి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా, ఇదే చిత్రానికి గాను జీవీ ప్రకాష్ కుమార్ ఉత్తమ నేపథ్య సంగీతం, ఆర్. కలైవనన్ ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు సాధించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా, టాలీవుడ్ నుంచి 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఉత్తమ వినోదాత్మక ప్రజాదరణ పొందిన చిత్రంగా (Best Popular Film Providing Wholesome Entertainment) నిలిచింది. అలాగే 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి సంబంధించి పీ రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం.

అలాగే పిల్లల చిత్రాల విభాగంలో 'చిన్న కథ కాదు' ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. మిగతా విభాగాలకు వస్తే, 'పుష్ప 2' చిత్రం నుంచి సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే, దీపాలి నూర్ మరియు శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నారు. అలాగే 'లక్కీ భాస్కర్' చిత్రానికి గాను వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా నిలిచారు. 'మహారాజా' చిత్రానికి అన్ అరాసు ఉత్తమ యాక్షన్ డైరెక్షన్‌గా, 'భ్రమయుగం' చిత్రానికి షెహనాద్ జలాల్ ఉత్తమ సినిమాటోగ్రఫీగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి ఎంపికైన ఈ విజేతలందరితో గుజరాత్‌లోని ఏక్తా నగర్ వేదికగా భారతీయ సినీ కళా వైభవం అంబరాన్ని అంటింది.
[ 72nd National Film Awards, Mammootty, Kartik Aaryan, Kalki 2898 AD, Committee Kurrollu, National Film Awards winners, Telugu One, Telugu News ]


