TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వారెవ్వా క్వినోవా.. అన్నం బదులు ఇది తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!

Published on: Tue Sep 29, 2026 9:18AM

అన్నానికి ప్రత్యామ్నాయంగా ఈమధ్య చాలామంది చూపు క్వినోవా వైపు మళ్లుతోంది. బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనుకునే వారు ప్రతిరోజూ తినే తెల్ల అన్నాన్ని పక్కన పెట్టి క్వినోవాను ఎంచుకుంటున్నారు. ఇది చూడటానికి చిన్న చిన్న గింజల్లా అనిపించినా, దీనివల్ల శరీరానికి అందే పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. మన చిరు ధాన్యాల మాదిరిగానే క్వినోవా కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ అన్నం స్థానంలో క్వినోవాను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి  మార్పులు వస్తాయో తెలుసుకుంటే..

ఎక్కువ పోషకాలు..

అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువ. దీనివల్ల అన్నం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ప్రత్యామ్నాయం. అలాగే, ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది. పదే పదే ఆకలి వేయకపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గడం చాలా తేలికవుతుంది.

తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు..

శాకాహారులకు క్వినోవా ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. సాధారణంగా మొక్కల సంబంధిత ఆహారాల్లో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం కష్టం. కానీ క్వినోవాలో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉన్నాయి. దీనివల్ల శరీరానికి కావలసిన సంపూర్ణ ప్రొటీన్ అందుతుంది. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

మలబద్దకానికి చెక్..

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం , జీర్ణక్రియ లోపాలు. క్వినోవాలో ఉన్న అధిక పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లేలా చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. 

గుండె ఆరోగ్యం కూడా..

క్వినోవా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్వినోవాలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

గ్లూటెన్ ఫ్రీ..

గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి క్వినోవా ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో గ్లూటెన్ ఉండదు. కాబట్టి గోధుమలు, ఇతర ధాన్యాలు పడనివారు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి  ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఐరన్ శరీరంలో రక్తం కొరత రాకుండా చూస్తే, మెగ్నీషియం నరాలు , కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

వండుకోవడం కూడా తేలిక..

క్వినోవాను వండుకోవడం కూడా చాలా తేలిక. బియ్యాన్ని ఏ విధంగా వండుకుంటామో, అదే విధంగా రెండుసార్లు నీటితో శుభ్రంగా కడిగి ఉడికించుకోవచ్చు. దీనిని ఉడికించిన తర్వాత కూరలతో కలిపి తినవచ్చు లేదా రకరకాల కూరగాయలు చేర్చి ఉప్మా, పులావ్, సలాడ్స్ రూపంలో కూడా తయారుచేసుకోవచ్చు.  రోజువారీ ఆహారంలో తెల్ల అన్నం స్థానంలో క్వినోవాను చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని, చక్కటి ఫిట్‌నెస్‌ను  సొంతం చేసుకోవచ్చు.

                    *రూపశ్రీ.