ఆడపిల్ల జీవితంలో గెలవాలి అంటే ఇలా పెంచండి..!
Published on: Sun Oct 4, 2026 2:13PM
ఆడపిల్ల జీవితంలో గెలవాలి అంటే ఇలా పెంచండి..!
.webp)
నేటి సమాజంలో ఆడపిల్లలకు కేవలం రక్షణ కల్పించడమే కాకుండా, వారు సొంత కాళ్లపై నిలబడేలా, జీవితంలో ప్రతి సవాలును జయించి విజేతలుగా నిలిచేలా పెంచడం ఎంతో అవసరం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ఆడపిల్లలు సుకుమారంగా, ఎలాంటి బాధ్యత, కష్టం తెలియకుండా, ఇంటి పనులన్నీ నేర్చుకుంటే చాలని అనుకుంటారు. కానీ తీసుకునే కొన్ని చిన్న జాగ్రత్తలు ఆడపిల్లల భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ఆడపిల్లలను కేవలం సున్నితంగా కాకుండా, ఆత్మవిశ్వాసం కలిగిన ధైర్యవంతమైన వనితలుగా తీర్చిదిద్దడానికి పాటించాల్సిన విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే..
ధైర్యవంతురాలుగా పెంచాలి..
అమ్మాయిలను మహారాణులుగానో లేదా ఎవరిపైనో ఆధారపడేవారిగానో కాకుండా ధైర్యంగా ఉండేలా పెంచాలి. ఆమెకు కాపలాగా ఉండటానికి మరొక రక్షకుడు అవసరం లేదని, తనకు తానే ఏకైక రక్షకురాలని చిన్నతనం నుంచే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. వారికది ఒక పెద్ద మానసిక బలాన్ని ఇస్తుంది.
అన్ని పనులు నేర్పాలి..
కొన్ని పనుల విషయంలో ఇది ఆడపిల్లలు చేసే పని కాదు అని ఎప్పుడూ అనకూడదు. ఇటువంటి మాటలు వారిలో భయాన్ని, న్యూనతాభావాన్ని పెంచుతాయి. సమాజంలో లేదా ఇంట్లో ఏ పనైనా తాము చేయగలమనే ధైర్యాన్ని వారికి అందించడం తల్లిదండ్రుల బాధ్యత.
ఆత్మరక్షణ..
ఆడపిల్లలకు చిన్నతనం నుంచే ఆత్మరక్షణ అంటే.. సెల్ఫ్ డిఫెన్స్ విద్యలను నేర్పించాలి. శారీరక బలం , ఆత్మరక్షణ నైపుణ్యాలు అమ్మాయిలలో కాన్ఫిడెన్స్ ను విశేషంగా పెంచుతాయి. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ఎదుర్కొనే ధైర్యం దీని ద్వారా లభిస్తుంది.
నో చెప్పడం నేర్పాలి..
తమకు నచ్చని లేదా ఇబ్బంది కలిగించే విషయాలకు కుదరదు లేదా నో అని చెప్పడం నేర్పించాలి. కాదనడం అనేది ఒక బలహీనత కాదని, కష్టంగా ఎవరి కోసమో దేన్నీ యాక్సెప్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని, నో చెప్పడం అంటే.. తమ పరిమితులను , హద్దులను కాపాడుకోవడానికి గీసుకున్న లక్ష్మణ రేఖ అని వారికి వివరించాలి. ఇది వారి స్వతంత్ర ఆలోచనకు దోహదపడుతుంది.
బాధ్యతలు..
ఇంట్లో ఉండే బాధ్యతలను మగపిల్లలతో సమానంగా అమ్మాయిలకు కూడా అప్పగించాలి. కుటుంబ నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేయడం, బాధ్యతలను సమానంగా పంచుకోవడం వల్ల వారిలో క్రమంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
భయాన్ని జయించడం..
భయాన్ని జయించిన ఏ అమ్మాయైనా ఈ ప్రపంచాన్ని సులువుగా గెలవగలదు. సరైన మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తే ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టించగలరు.
ఆడపిల్లను సున్నితంగా, అపురూపంగా పెంచడం తప్పు కాదు.. కానీ.. ఆడపిల్లను భస్తురాలిగా, తండ్రిచాటు పిల్లగానో, తల్లిచాటు పిల్లగానో.. ఎవరో ఒకరు తన ముందు ఉంటే తప్ప.. తాను ఏమి సాధించలేను అనే మెంటాలిటీ కలిగిన పిల్లగానో మాత్రం పెంచకూడదు. అమ్మ నాన్న, తోబుట్టువులు.. పెళ్ళయ్యాక భర్త, అత్తమామ.. ఇలా ఎవ్వరు లేకపోయినా సరే.. ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడిపే ధైర్యాన్ని అమ్మాయిలకు ఇవ్వాలి. ఇలాంటి అమ్మాయిలు అద్భుతాలు చేస్తారు. తన చుట్టూ ఉన్నవారికి కీర్తి తెచ్చిపెడతారు.


