TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇది రేవంత్ సర్కార్ సృష్టించిన కరవు.. హరీష్ ధ్వజం.!

Published on: Sat Sep 19, 2026 5:53PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తలెత్తిన కరవు పరిస్థితులను అధికార కాంగ్రెస్ తీసుకువచ్చిన దుర్భిక్షంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత తన్నీరు హరీష్ రావు అభివర్ణించారు.  రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు.  ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్  అసమర్థ  విధానాలే కారణమని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల నిర్వహణ,  వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.  

హైదరాబాద్‌లో  శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు..  అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండించారు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి   84 టీఎంసీల నీటిని వాడుకున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అబద్ధాలన్నారు.   క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటివరకు కేవలం 8 టీఎంసీల నీటిని మాత్రమే తరలించగలిగారని  వివరించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని ఐదు ప్రధాన మోటార్లలో ప్రస్తుతం కేవలం రెండే పని చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.  

గత మూడేళ్ల కాలంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు విడుదల చేసిన గణాంకాలను హరీష్ రావు  ఈ సందర్భంగా   ప్రస్తావించారు. కేఆర్‌ఎంబీ నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  718 టీఎంసీల నీటిని వినియోగించుకుందనీ, అదే  తెలంగాణ మాత్రం కేవలం 216 టీఎంసీలకు మాత్రమే  అయ్యిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కృష్ణా జలాల వాడకం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అంటూ విమర్శించారు.

రాష్ట్రంలో నదుల్లో నీరు పుష్కలంగా అందుబాటులో ఉందని, పొలాలకు నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్న హరీష్ రావు.. నీటిని సక్రమంగా మళ్లించుకోలేని చేతకానితనంలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా నిరంతరం నీటిని  తరలించుకుపోతున్నా..  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించారు.  తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ ఆరోపించారు.  

[Congress Government Drought, Krishna River Water Utilization, Srisailam Water Dispute, BRS Party Telangana, Harish Rao, Revanth Reddy, Telugu One]