సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు..!
Published on: Tue Sep 8, 2026 8:49PM

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో వైసీపీకి కీలక నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడైన చిన్న శ్రీను టీడీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర, పలువురు అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
టీడీపీలో చేరికకు ముందు మంగళవారం సాయంత్రం చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ పంపారు. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.
ప్రస్తుతం చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. విజయనగరం జిల్లాలో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించారు. అలాంటి నేత పార్టీని వీడటం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బొత్స కుటుంబంలో కీలక రాజకీయ నేతగా ఉన్న చిన్న శ్రీను వైసీపీని వీడటం ఆ పార్టీతో పాటు బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రాబల్యంపైనా చర్చకు దారితీసింది. కొంతకాలంగా చిన్న శ్రీను వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపించాయి.
చిన్న శ్రీను పార్టీని వీడటానికి బొత్స సత్యనారాయణతో ఉన్న అంతర్గత విభేదాలే కారణమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలే ఉన్నాయని చిన్న శ్రీను పేర్కొన్నట్లు సమాచారం. అసలు కారణాలు ఏమైనప్పటికీ.. బొత్స కుటుంబానికి చెందిన కీలక నేత టీడీపీలో చేరడం మాత్రం విజయనగరం రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది.స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న సమయంలో చిన్న శ్రీను టీడీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించు కుంది. విజయనగరం జిల్లాలో తన రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడే పార్టీని వీడటం ఇబ్బందికర పరిణామంగా మారింది.
.webp)
మరోవైపు చిన్న శ్రీను చేరికతో విజయనగరం జిల్లాలో టీడీపీ మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వెంట వచ్చిన అనుచరుల సంఖ్య, జిల్లాలో ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలు రానున్న రోజుల్లో టీడీపీకి ఎంతవరకు ఉపయోగపడతాయనేది ఆసక్తికరంగా మారింది. చిన్న శ్రీను పార్టీ మార్పుతో విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? వైసీపీకి ఇది ఎంతమేర నష్టం కలిగించనుంది? టీడీపీకి ఆయన చేరిక ఎంతవరకు కలిసొస్తుంది? అనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
(Majji Srinivasa Rao, Chinna Srinu resignation, YSRCP Vizianagaram, Botsa Satyanarayana nephew, Vizianagaram ZP Chairman, AP Politics Latest News, Telugu One, Telugu News)


