టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. భక్తులకు బీమా సదుపాయం..!
Published on: Wed Sep 9, 2026 3:03PM

తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో తొలిసారిగా ఎల్‌ఐసీ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ప్రమాదవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల బీమాను రూ.10 లక్షలకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.
అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుమలలో సహజ మరణం సంభవించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం ఎల్‌ఐసీకి టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సీపీఎస్, ఎన్‌పీఎస్ పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఈహెచ్ఎఫ్ సౌకర్యం కల్పించడంతో పాటు రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు ఆమోదం తెలిపారు.
తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభజించి, హైడ్రాలిక్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేయనున్నారు. ఇందుకోసం బయోగ్యాస్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను రూ.2.80 కోట్లతో జీపీఎస్ రెన్యూవబుల్స్ సంస్థకు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు.
.webp)
శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్ కార్మికుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. ఇందుకోసం మూడేళ్లకు రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఎఫ్‌ఎంఎస్‌లో విధులు నిర్వహించిన కార్మికులకు లడ్డూ, వడ అందించేందుకు నిర్ణయించారు.
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్ల వ్యయానికి ఆమోదం లభించింది.
తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్స్ గడువును మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆమోదం తెలిపారు. 2026 నవంబర్ 2 నుంచి 2029 నవంబర్ 1 వరకు లైసెన్స్ గడువు పొడిగించనున్నారు. దాతల సౌకర్యార్థం నామినీల మార్పుకు మరింత వెసులుబాటు కల్పిస్తూ విధాన సవరణకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.49 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా రూ.7.56 కోట్ల రెండో విడత నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. మిగిలిన మొత్తాన్ని పనుల పురోగతి, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా విడతల వారీగా విడుదల చేయనున్నారు. అదనంగా సరఫరా చేసే 10 ఎంఎల్‌డీ నీటికి మాత్రమే 50 శాతం రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఎంవోయూ కుదుర్చుకునేందుకు కూడా ఆమోదం తెలిపారు.
టీటీడీ ఈహెచ్ఎఫ్ పథకం కింద 2026 మే నుంచి జూలై వరకు రూ.5 లక్షలకు మించిన వైద్య ఖర్చులు చేసిన 15 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తం రూ.54.66 లక్షల వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు.
(TTD, Tirumala Tirupati Devasthanams, Tirumala News, TTD Chairman BR Naidu, BR Naidu, TTD Governing Council Meeting, Tirumala Insurance Scheme, LIC Insurance, Devotee Insurance, Tirumala Devotees, Accidental Death Insurance, Natural Death Compensation, LIC, Telugu One, Telugu News)


