TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీసుల మిస్‌ఫైర్.. పొలంలో పనిచేస్తున్న రైతుకు బుల్లెట్ గాయం..!

Published on: Wed Sep 9, 2026 5:08PM

నిత్యం పంట పొలంలో కష్టపడుతూ.. కుటుంబాన్ని పోషించుకునే ఓ రైతు ఒక్కసారిగా తుపాకీ బుల్లెట్‌కు గురయ్యాడు. పోలీసుల ఫైరింగ్ ప్రాక్టీస్‌లో జరిగిన మిస్‌ఫైర్‌.. పొలంలో పనిచేసుకుంటున్న రైతు జీవితంలో ఊహించని విషాదాన్ని నింపింది.

నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచర్ల పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మంగళవారం ఏఆర్ పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్న సమయంలో ఓ పోలీసు మిస్‌ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సమీపంలోని పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న సీతారాం సీతారామయ్య అనే రైతు తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు సమాచారం.

ఒక్కసారిగా బుల్లెట్ తగలడంతో రైతు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.

అయితే.. ఇంత తీవ్రమైన ఘటన జరిగినప్పటికీ విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైరింగ్ రేంజ్ చుట్టూ భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి? సమీపంలోని పొలాల్లో రైతులు పనిచేస్తున్న విషయం అధికారులకు తెలియదా? మిస్‌ఫైర్‌కు కారణమేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

పోలీసుల శిక్షణ కోసం నిర్వహించే ఫైరింగ్ ప్రాక్టీస్‌లోనే ఓ అమాయక రైతు బుల్లెట్‌కు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రాణాలను పణంగా పెట్టి పంట పండించే రైతు.. మరోవైపు భద్రత కోసం ఆయుధాలు వినియోగించే పోలీసులు. ఇద్దరి మధ్య ఉండాల్సిన భద్రతా గీత దాటిపోవడంతోనే ఈ ఘటన జరిగిందా అన్నది తేలాల్సి ఉంది.

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, అసలు మిస్‌ఫైర్ ఎలా జరిగిందో, బాధ్యులు ఎవరో అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. రైతుకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

 

(Nellore Police, Police Misfire, Bullet Injury, Farmer Injured, Nellore Rural, AR Police, CM Chandrababu, Naralokesh, Home minister anitha, Telugu News, Telugu One)