బీఎస్పీలో సంచలనం..మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు మాయావతి బిగ్ షాక్..!
Published on: Thu Sep 3, 2026 5:46PM

రాజకీయ పరిణతి లేదంటూ ఆనంద్‌పై బీఎస్పీ అధినేత్రి ఫైర్..!
ఉత్తరప్రదేశ్ రాజకీయాలోనే కాకుండా దేశ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. పార్టీలో సొంత మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ఒకానొక సమయంలో తన రాజకీయ వారసుడిగా ప్రచారం చేస్తూ, కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి.. ఇప్పుడు ఉన్నపళంగా ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు వేశారు. ఢిల్లీలో తాజాగా జరిగిన బీఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాయావతి మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆకాష్ ఆనంద్‌కు పార్టీలో అతి ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించేంత రాజకీయ పరిణతి, అనుభవం ఇంకా రాలేదని ఆమె బహిరంగంగా స్పష్టం చేశారు. బాధ్యతలు నిర్వహించాలంటే కేవలం బంధుత్వం ఉంటే సరిపోదని, ప్రజాక్షేత్రంలో మరింత అనుభవం గడించి పరిణతి సాధించాల్సిన అవసరం ఉందోనని ఆమె తేల్చిచెప్పారు. గతంలో ఆకాష్ ఆనంద్‌కు పార్టీ జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చి, దేశవ్యాప్తంగా బీఎస్పీ పునర్నిర్మాణ బాధ్యతలను ఆమె అప్పగించిన సంగతి తెలిసిందే.

అయితే రాబోయే కీలకమైన ఎన్నికల సమయానికి ముందు ఆయనను ఆ పదవి నుండి పక్కన పెట్టడం వెనుక అనేక రాజకీయ సమీకరణాలు ఉన్నాయని తెలుస్తోంది. మాయావతి ప్రకటన ప్రకారం, ఆకాష్ ఆనంద్ ఇంకా మరింత పరిణతి సాధించడమే కాకుండా, కార్యకర్తలు నాయకుల నుండి పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొందాల్సి ఉంది. అంతవరకు ఆయనకు పార్టీ పరంగా ప్రధాన లేదా కీలక బాధ్యతలు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే పార్టీ కోసం ఒక సాధారణ నాయకుడిగా, కార్యకర్తగా స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాయావతి వెల్లడించారు.
ఇదే సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపైనా మాయావతి స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఏ ఇతర పార్టీతోనూ, కూటమితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఏకపక్షంగా, ఒంటరిగానే మొత్తం అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతామని ప్రకటించారు. ఇదివరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ బీఎస్పీ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతుందని చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. బహుజనులు, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలన్నదే తమ పార్టీ ఏకైక లక్ష్యమని, దీనికోసం క్షేత్రస్థాయిలో ఒంటరి పోరాటమే శ్రేయస్కరమని మాయావతి భావిస్తున్నారు.

సొంత కుటుంబ సభ్యుడైనప్పటికీ పార్టీ ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మాయావతి నిరూపించారని ఆమె మద్దతుదారులు అంటుంటే, ఈ నిర్ణయంతో బీఎస్పీలో తదుపరి నాయకత్వం ఎవరనే ప్రశ్న మళ్లీ మొదలైంది. కుటుంబ పరిపాలన అనే విమర్శలను తిప్పికొట్టేందుకే మాయావతి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారా లేక ఆకాష్ ఆనంద్ శైలి పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారా అనే చర్చ తీవ్రమవుతోంది. ఏది ఏమైనా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ మాయావతి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం బీఎస్పీ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
(Mayawati, Akash Anand, BSP news, Mayawati nephew Akash Anand, UP Assembly Elections, BSP politics, SP Party, CM Yogi, Telugu One, Telugu News)


