TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భర్త ఫోన్‌ ఎత్తలేదని.. క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య..!

Published on: Tue Sep 8, 2026 4:09PM

మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల (20)కు రెండేళ్ల క్రితం మహబూబాబాద్‌కు చెందిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ బాణోత్‌ హుస్సేన్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఓ చిన్నారి ఉంది. కొంతకాలంగా కుటుంబ జీవితం సాఫీగా సాగుతోంది. ఇటీవల అఖిల పుట్టింటికి వెళ్లింది.

ఈ నెల 2న చిన్నారి ఏడుస్తుండటంతో.. భర్తకు చూపించి, పాపతో మాట్లాడించేందుకు అఖిల వీడియో కాల్‌ చేసింది. అయితే ఆ సమయంలో హుస్సేన్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో భర్త తన కాల్‌ ఎందుకు ఎత్తలేదన్న ఆలోచనతో అఖిల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత క్షణికావేశంలో మహబూబాబాద్‌లోని అత్తగారింటికి చేరుకున్న అఖిల ఎలుకల మందు పేస్ట్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున అఖిల మృతిచెందింది.

కళ్ల ముందే భార్య మృతిచెందడంతో భర్త కన్నీరుమున్నీరయ్యాడు. తల్లిని కోల్పోయిన చిన్నారి పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. చిన్న అపార్థం.. క్షణికావేశం.. చివరకు ఓ నిండు కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

 

(Mahabubabad News, Telangana News, Married Woman Suicide, Akhila Suicide, Husband Phone Call, Family Tragedy, Mahabubabad Crime News, Telangana Crime News, Woman Suicide, Emotional News, Family Tragedy Telangana, Nekonda News, Warangal News, Suicide Case, Police Investigation)