కవితపై అభ్యంతరకర పోస్టులు.. కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసు..!
Published on: Wed Sep 9, 2026 4:01PM

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ సీఏఆర్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌పీసీ-13584 కె. అనిల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో కవితను ఉద్దేశించి అసభ్యకర, అవమానకర భాషతో కూడిన అభ్యంతరకర కంటెంట్‌ను పోస్టు చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు అందిన వెంటనే సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది సోషల్ మీడియా వినియోగంలోనూ క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, మర్యాదను పాటించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే కె. అనిల్ అభ్యంతరకర పోస్టులు చేయడం ద్వారా శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, కర్తవ్య నిర్వహణలో లోపం, ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు పేర్కొంటూ *TSCS (CC&A) Rules-1964లోని రూల్-3ను ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

**TS Civil Services (Classification, Control and Appeal) Rules, 1991లోని రూల్-8, సబ్‌రూల్-2(ఎ)* కింద ఉన్న అధికారాలతో అనిల్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో *క్రైమ్ నంబర్ 589/2026* కింద కె. అనిల్‌పై *BNS సెక్షన్లు 75, 79, ఐటీ యాక్ట్ సెక్షన్ 67* కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అభ్యంతరకర కంటెంట్‌ను అనిల్ తన సొంత మొబైల్ ఫోన్ ద్వారా పోస్టు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (FSL) పంపించారు.
హైదరాబాద్ సీపీ నుంచి ప్రాథమిక విచారణ నివేదిక అందిన అనంతరం అంతర్గత శాఖాపరమైన విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం శిక్ష విధిస్తామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన శాఖాపరమైన విచారణలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళలపై దురుసు ప్రవర్తన, చట్ట ఉల్లంఘన, పోలీస్ సిబ్బంది దుష్ప్రవర్తన విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ *జీరో టాలరెన్స్ విధానం పాటిస్తోందని అధికారులు వెల్లడించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్ష నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగుచూసే అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(Kalvakuntla Kavitha, Telangana Police Department, Cyber Crimes Police, FSL, Constable K. Anil, CM Revanth reddy, DGP C.V. Anand, CP Sajjanar, Telugu One, Telugu News)


