TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం.. సీఎం చంద్రబాబు కీలక వరాలు..!

Published on: Wed Sep 2, 2026 7:34PM

ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో ఓ చారిత్రాత్మక ఘట్టం సాకారమైంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కల నెరవేర్చే దిశగా పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద  సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పుష్కర గోదావరి తుంగభద్రల మాతృస్వరూప జలాలకు వేద మంత్రోచ్ఛారణల నడుమ పవిత్ర జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కరువు పీడిత ప్రాంతాలకు, సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఉత్తరాంధ్ర భూములకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన ప్రకటించారు.

నదుల అనుసంధానం ద్వారా మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. గతంలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో రాయలసీమకు నీటి కష్టాలు తీర్చినట్లే, ఇప్పుడు పోలవరం ఎడమ కాలువను వేగవంతంగా పూర్తిచేసి ఉత్తరాంధ్రలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు  తాగునీటి ఎద్దడిని దూరం చేస్తామని ఉద్ఘాటించారు. పాయకరావుపేట నుంచి ప్రారంభమైన ఈ జల ప్రవాహం అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ప్రజల తాగునీటి దాహాన్ని తీర్చడమే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి బొట్టు నీటిని పొదుపుగా వాడుకుంటూ, నీటి నిర్వాహక వ్యవస్థను ఆధునీకరించి చివరి ఆయకట్టు వరకు నీటిని చేరవేస్తామని హమీ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు నీటి లభ్యతే కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అనకాపల్లి జిల్లాను కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతంగానే కాకుండా, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఇటీవల నక్కపల్లి వద్ద రూ. 1.36 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయంతో ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేశామని, ఇది రాబోయే రోజుల్లో అతిపెద్ద స్టీల్ సిటీగా మారబోతోందని గుర్తుచేశారు. గూగుల్ డేటా సెంటర్ సహా పలు ఐటీ, తయారీ రంగాలు ఉత్తరాంధ్ర వైపు మొగ్గు చూపుతున్నాయని, దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ తరహా భారీ పరిశ్రమలకు అవసరమైన నీటి మౌలిక వసతులను గోదావరి జలాల మళ్లింపు ద్వారా సులభతరం చేస్తున్నట్లు వెల్లడించారు.

గత పాలనలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 10.75 శాతం వృద్ధి నమోదైందని, రాబోయే కాలంలో 15 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని, ప్రతి రైతు కళ్లలో ఆనందం చూడటమే తమ నిజమైన విజమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర భూములు గోదావరి జలాలతో తడిసి ముద్దయి, వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

(Godavari Water Released, Chandrababu Naidu, Polavaram Left Canal, Anakapalli Irrigation, River Linking AP, Uttarandhra Development, Telugu One, Telugu news)