TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యూట్యూబ్‌లో చూసి.. నకిలీ నోట్లు ముద్రణ.. కట్ చేస్తే జైలు పాలు..!

Published on: Wed Sep 2, 2026 6:21PM

 

ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో  నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన వీడియో లను చూసి.. వాటి ఆధారంగా అవసరమైన పరికరాలను సమకూర్చుకుని ఏకంగా ఇంట్లోనే నకిలీ నోట్లు తయారీ  దందాకు తెరలేపారు. అనంతరం రాత్రివేళల్లో వైన్‌షాపులు, కూరగాయల మార్కెట్లలో స్వల్ప మొత్తాల కొనుగోళ్లకు వాటిని వినియోగిస్తూ చెలామణి చేసేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. కమీషనర్స్ టాస్క్‌ఫోర్స్ (శంషాబాద్ జోన్), బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. 

రామావత్ రాము అలియాస్ మహమ్మద్ (36), రామావత్ మోతీలాల్ (35), రామావత్ గాంధీ (19)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా వడ్డిపట్ల, చింతల్ తండాకు చెందినవారిగా గుర్తించారు. నిందితుల నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన ఎప్సన్ L6460 కలర్ ప్రింటర్, ఎప్సన్ కలర్ ఇమేజ్ స్కానర్, జెబ్రోనిక్స్ లామినేటర్, పేపర్ కట్టర్, వాటర్‌మార్క్ పేపర్లు, వివిధ రంగుల లిక్విడ్లు, బాండ్ పేపర్లు, ఇతర ముద్రణ సామగ్రితో పాటు మూడు స్మార్ట్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

 

అరెస్టయిన రామావత్ రాము జొమాటో డెలివరీ బాయ్‌గా, మోతీలాల్ రాపిడో డ్రైవర్‌గా, గాంధీ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాము నకిలీ నోట్ల దందాకు పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన బంధువు మోతీలాల్‌తో కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నకిలీ కరెన్సీ తయారీకి సంబంధించిన వీడియోలను వీక్షించారు. అనంతరం మోతీలాల్‌కు యూట్యూబ్ ద్వారా లభించిన ఓ ఫోన్ నంబర్‌ను సంప్రదించి నకిలీ నోట్ల తయారీకి అవసరమైన ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్లు తదితర వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత అవసరమైన పరికరాలను కొనుగోలు చేసి అసలు నోట్లను పోలిన విధంగా నకిలీ కరెన్సీని తయారు చేయడం ప్రారంభించినట్లు విచారణలో వెల్లడైంది.

తయారు చేసిన నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు నిందితులు రాత్రివేళలను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వైన్‌షాపులు, కూరగాయల మార్కెట్లలో తక్కువ మొత్తాల లావాదేవీలకు నకిలీ నోట్లను వినియోగిస్తూ వచ్చారు. చిన్న మొత్తాల లావాదేవీల్లో నకిలీ నోట్లను సులభంగా గుర్తించలేరన్న ఉద్దేశంతో ఈ విధంగా చెలామణి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడి మేనల్లుడైన గాంధీ ద్వారా కూడా నకిలీ నోట్లను మార్కెట్లోకి పంపేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో రూ.500 విలువైన 437 నోట్లు, రూ.100 విలువైన 648 నోట్లు, రూ.200 విలువైన 39 నోట్లు ఉన్నాయి. మొత్తంగా 1,124 నకిలీ నోట్లు లభించగా.. వాటి విలువ రూ.2,91,100గా పోలీసులు తెలిపారు. అసలు నోట్లను స్కాన్ చేసి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించినట్లు భావిస్తున్న రూ.500 నోట్లు నాలుగు, రూ.100 నోట్లు నాలుగు కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

నకిలీ కరెన్సీ తయారీ కోసం నిందితులు పెద్ద మొత్తంలో ముద్రణ సామగ్రిని సమకూర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎప్సన్ L6460 కలర్ ప్రింటర్, ఎప్సన్ కలర్ ఇమేజ్ స్కానర్, జెబ్రోనిక్స్ లామినేటర్, పేపర్ కట్టర్ టూల్ బాక్స్, వివిధ రంగుల లిక్విడ్లు, గ్రీన్ ర్యాపింగ్ కవర్లు, వైట్ పేపర్ బండిల్స్, గాంధీ చిత్రంతో ముద్రించిన బాండ్ పేపర్లు, వాటర్‌మార్క్ పేపర్లు, ఐరన్ స్కేల్, గ్లాస్ తదితర సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. మూడు స్మార్ట్‌ఫోన్లు, TG 07 BE 9434 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న సుధీర్ జాన్ చేలా అలియాస్ వంశీని కూడా పోలీసులు గుర్తించారు. నాగోల్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.

 

 

అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు రామావత్ రాము అలియాస్ మహమ్మద్‌పై గతంలోనూ కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నల్గొండ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 07/2022 కింద ఐపీసీ సెక్షన్ 498(ఏ), డీపీ యాక్ట్ సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు.నకిలీ కరెన్సీ తయారీ, చెలామణికి సంబంధించి అందిన పక్కా సమాచారంతో కమీషనర్స్ టాస్క్‌ఫోర్స్ (శంషాబాద్ జోన్), బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లు, ముద్రణ పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. ఈ ముఠా గతంలో ఎంత మొత్తంలో నకిలీ నోట్లను తయారు చేసింది, ఎక్కడెక్కడ చెలామణి చేసింది, వీరికి మరెవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

(Fake currency gang busted hyderabad, Counterfeit currency seized 2.91 lakh, Hyderabad police crime news, Fake notes printing equipment seized, Fake 500 notes hyderabad, counterfeit money racket telangana, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police)