TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్ఎస్ శాసన మండలి సభ్యుల ప్రవర్తనపై సభ తీవ్ర ఖండన..!

Published on: Tue Sep 8, 2026 5:55PM

క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!

తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డి సెప్టెంబర్ 7న శాసనసభ ప్రాంగణంలోని గేట్ నంబర్ 3 సమీపంలో గౌరవ శాసనసభాపతిని ఉద్దేశించి అత్యంత అవమానకరంగా, కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను సభ తీవ్రంగా ఖండించింది. సభా మర్యాదలకు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై నిరసనను నమోదు చేసింది.

అదే విధంగా, మహిళల సమక్షంలో ఇద్దరు సభ్యులు చొక్కాలు విప్పి అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని కూడా సభ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రవర్తన శాసన మండలి సభ్యుల హోదాకు ఏమాత్రం తగదని సభ అభిప్రాయపడింది.

శాసనసభాపతి గౌరవం, అధికారానికి భంగం కలిగించేలా సభ్యులు వ్యవహరించడం రాజ్యాంగబద్ధ హోదాను అవమానించడమే కాకుండా తెలంగాణ శాసనసభ గౌరవం, సభా హక్కులు, సంస్థాగత సమగ్రతకు విఘాతం కలిగించే చర్యగా సభ పేర్కొంది.

రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా ఉన్నప్పటికీ, సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించేలా సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని సభ స్పష్టం చేసింది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని కూడా సహించేది లేదని పేర్కొంది.

తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్ రావు బాధ్యత వహించి, సభా హుందాతనం, మర్యాదలను పరిరక్షించేందుకు శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సభ తీర్మానించింది.

అలాగే, తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఉన్నందున.. ఈ తీర్మానం ప్రతితో పాటు సభ ముందు ఉంచిన ఆధారాలు, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, సంబంధిత కార్యకలాపాల వివరాలను తెలంగాణ శాసన మండలి చైర్మన్‌కు పంపించాలని సభ నిర్ణయించింది.

ఈ అంశంపై శాసన మండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్‌ను కోరుతూ సభ తీర్మానించింది.

 

 

 

(BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)