బొల్లారం ఆయుధాల చోరీపై దర్యాప్తు వేగవంతం..!
Published on: Wed Sep 2, 2026 6:59PM

ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
బొల్లారం ఆర్మీ కాంపౌండ్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆర్మీ అధికారులతో కలిసి పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వెపన్స్ బ్యారక్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజూ ఒకే సమయంలో కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో కెమెరాలను ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ చేసి ఆయుధాలను దోచుకుని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంపౌండ్‌లోకి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు, కెమెరాలు పనిచేయని సమయంలో ఏం జరిగిందన్న వివరాలను సేకరిస్తున్నారు.
ఈ చోరీ వెనుక కాంపౌండ్‌లోని వ్యక్తుల హస్తం ఉందా..? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఆయుధాలు ఆర్మీ కాంపౌండ్ దాటి బయటకు వెళ్లలేదని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్మీ అధికారులను హనీట్రాప్ చేసి కీలక సమాచారం సేకరించిన అనంతరం ఆయుధాలను దోచుకున్నారా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయానికి అత్యంత సమీపంలో ఉన్న వెపన్స్ బ్యారక్‌లో చోరీ జరగడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. చోరీకి గురైన ఆయుధాలు అసాంఘిక శక్తుల చేతికి చేరాయా? వాటిని ఏదైనా నేర కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందా..? అనే అంశాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తో పాటు హైదరాబాద్ పోలీసులు, మల్కాజ్‌గిరి పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు భాగస్వాములయ్యారు. ఆయుధాల చోరీ వెనుక ఉన్న వ్యక్తులు, వారికి సహకరించినవారు, ఆయుధాల ప్రస్తుత ఆచూకీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి అనుమానాస్పద కదలికలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ నేపథ్యంలోనే భద్రతా చర్యల్లో భాగంగా కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఆయుధాల చోరీ ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఆయుధాల చోరీకి పాల్పడింది ఎవరు..? కాంపౌండ్ నుంచి ఆయుధాలు ఎలా బయటకు తరలించారు..? సీసీ కెమెరాలు ఒకే సమయానికి ఎందుకు పనిచేయడం లేదు? ఈ వ్యవహారం వెనుక అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా..? ఆయుధాలు అసాంఘిక శక్తుల చేతికి చేరాయా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు దర్యాప్తు బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి
(Bollaram Army Compound, Weapons theft case, Weapons Barracks, Cantonment, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Telugu One, Telugu news)


