TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు.. రూ.3.54 కోట్ల ఆస్తులు గుర్తింపు..!

Published on: Thu Sep 3, 2026 6:34PM

ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, కోదాడ మున్సిపాలిటీ ఇన్‌చార్జి టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా పనిచేస్తున్న వయ్యాల సోమయ్యపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. అక్రమ, అనుమానాస్పద మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు మంగళవారం సోమయ్య కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులు, ఇతరులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వ హించారు.

 

సోదాల్లో భారీగా స్థిర, చరాస్తులతోపాటు నగదు, బంగారం, వెండి, బ్యాంకు నిల్వలు, వాహనాలు, గృహోపకర ణాలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో సోమయ్యకు 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. దీని అధికారిక విలువ రూ.2.94 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. 

సూర్యా పేట జిల్లా, హైదరాబాద్‌లో ఐదు నివాస ఆస్తులను గుర్తించారు. వీటిలో జీ+1, జీ+2, జీ+4తోపాటు పెంట్‌హౌస్‌ భవనాలు, మరో రెండు గ్రౌండ్‌ఫ్లోర్‌ ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. వీటి అధికారిక విలువ 2.75 కోట్లుగా ఉంది. అలాగే సూర్యాపేట పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించగా.. వాటి అధికారిక విలువ 25.85 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో రూ.4,63,990 నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల మేర నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. 709 గ్రాముల బంగారు ఆభర ణాలు, 1,750 గ్రాముల వెండి ఆభరణాలు లభించగా.. వీటి విలువ సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు. 

రెండు నాలుగు చక్రాల వాహనాలు, మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించగా.. వాటి విలువ సుమారు రూ.25 లక్షలుగా ఉంది. ఇంట్లోని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల విలువ మరో రూ.11 లక్షలుగా ఏసీబీ అధికా రులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా.. బ్యాంకు లో 66 తులాల బంగా రాన్ని తాకట్టు పెట్టి రూ.49 లక్షల గోల్డ్‌ లోన్‌ తీసుకున్నట్లు కూడా ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులన్నింటి అధికారిక విలువను కలిపితేరూ.3,54,36,490గా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే స్థిరాస్తుల మార్కెట్‌ విలువ అధికారిక విలువ కంటే గణనీయంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాటిని ఏ మార్గంలో సమకూర్చుకు న్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టం- 1988లోని సెక్షన్‌ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. నిందితుడు సోమయ్యను హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు దా రుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

 

 

(ACB raids, Suryapet district, Planning officer, Yayala Somaiah, CM Revanth reddy, Telangana government, Telugu News, Telugu One)