నెమళ్ళ వేటని ఆపలేమా?
Published on: Wed Aug 22, 2012 3:55PM
భారతజాతీయపక్షి నెమలి వేటను ఆపటం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దసవాల్‌గా మారింది. నెమలిని భుజిస్తే స్థూలకాయులు బరువు తగ్గుతారని ప్రపంచ అథ్యయన సంస్థలు ప్రకటన చేసినప్పటి నుంచి వీటిని రక్షించటం ప్రభుత్వాలకు పెద్దసవాల్‌గా మారింది. కనీసం రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలన్న అంశంపై అథ్యయనం చేస్తూ అటవీశాఖ కాలం గడుపుతోంది. దీంతో నెమలికి వేలాది రూపాయలు వెలకట్టి మరీ కొందరు వేటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు.
.jpg)
వేటగాళ్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడ నెమళ్లు దొరుకుతాయో అక్కడికి వెళ్లి వాటిని చంపి పార్శిల్ చేసేస్తున్నారు. దీంతో అటవీశాఖ గిరిజనులకు నెమలివేట నిషిద్ధమని ప్రత్యేకించి చెప్పాల్సి వస్తోంది. అటవీఅధికారుల కన్నుగప్పి వేటగాళ్లు ఈ వేటకు ఉపక్రమిస్తున్నందున ప్రభుత్వం ఈ పక్షిని రక్షించుకునేందుకు చట్టానికి పదును పెట్టింది. కోర్టుల్లోనూ కఠినశిక్షలు విధిస్తున్నా నెమలివేట నేరాన్ని అదుపు చేయటం కష్టతరంగా మారింది.

నల్గొండజిల్లా భువనగిరి మండలం ముత్యాలపిల్ల`పెద్దగోరి చెక్‌డ్యాం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నెమళ్లను వేటాడారు. నెమళ్లను సంహరించి ఈకల్ని అక్కడ గుట్టగా పేర్చారు. గ్రామస్తులు బహిర్భూమికి వెళ్లినపుడు ఈ విషయాన్ని గుర్తించారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలో నెమళ్ల సంచారం పెరిగింది. నెమలి మాంసం కోసం కొందరు ఐదు నుంచి ఏడు నెమళ్లను వేటాడి చంపినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిందితుల గురించి పోలీసులు, అటవీశాఖాధికారులు అన్వేషణ ప్రారంభించారని సమాచారం.


