యూపీఐ సేవలపై వడ్డింపు వెనుక అమెరికా హస్తం?
Published on: Wed Sep 16, 2026 4:13PM
.webp)
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై తాజాగా ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) నిబంధనల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు నిత్యం సులభంగా ఉపయోగించే యూపీఐ సేవలపై ఛార్జీల విధింపునకు మార్గం సుగమం చేయడం వెనుక అమెరికా ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. అమెరికా చెల్లింపుల దిగ్గజ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, రెండు వేలు అంత కంటే ఎక్కువ మొత్తంలో జరిగే కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించనుంది. రూ.75 వేలు అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఈ రుసుమును గరిష్టంగా మూడు వందల రూపాయలకు పరిమితం చేశారు. అయితే, సాధారణ వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలతో పాటు, రెండు వేల రూపాయల లోపు ఉండే చిన్న చెల్లింపులు యథావిధిగా పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. అంతేకాకుండా ఈ ఛార్జీలను వినియోగదారులు నేరుగా చెల్లించాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా వ్యాపార వ్యవస్థ పరిధిలోనిదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
అయితే ప్రభుత్వ వివరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు.. ఈ నిర్ణయం పరోక్షంగా సామాన్య ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతుందని ఆరోపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోదీ సర్కార్ దేశీయ డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని నీరుగారుస్తోందని ఆరోపించారు. గతంలో యూపీఐ సేవలు పూర్తిగా ఉచితంగా లభించేలా చూసిన జీరో ఎండీఆర్ విధానానికి స్వస్తి పలికేలా ప్రస్తుత మార్పులు ఉన్నాయని విమర్శించారు. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అమెరికన్ సంస్థలు భారతీయ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయనే కారణంతోనే, అమెరికా ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ కూడా ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ( గతంలో యూపీఐ జీరో ఎండీఆర్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు అదే ఒత్తిడి కారణంగా భారత్ తన విధానాన్ని మార్చుకుంటోందనీ పేర్కొన్నారు. కేవలం వ్యాపారులపైనే ఈ భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆ భారాన్ని వ్యాపారులు తమ వస్తువుల ధరల్లో సర్దుబాటు చేసుకుంటారని, ఫలితంగా అంతిమంగా ఆ భారం వినియోగదారుడి జేబుపైనే పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో డిజిటల్ లావాదేవీల వృద్ధికి యూపీఐ ఒక ప్రధాన బలమైన మూల స్తంభంగా నిలిచింది. ఎలాంటి అదనపు రుసుములు లేకపోవడంతో వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ల వరకు అందరూ దీనిని ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ, భద్రత ప్రమాణాలు, సాంకేతిక మౌలిక వసతుల కల్పన కోసం సుస్థిరమైన ఆదాయ వనరు అవసరమని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మొత్తం పరిణామాలు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక రంగంలో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఈ విధానం కేవలం మర్చంట్ వ్యవస్థకే పరిమితమవుతుందా, లేక పరోక్షంగా వినియోగదారులపై ధరల రూపంలో భారం మోపుతుందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకుంటున్న విపక్షాలు, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని అమెరికా ఒత్తిళ్లకు తాకట్టు పెడుతున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మొత్తం మీద ఉచితం నుంచి వడ్డింపు వరకూ సాగిన ఇండియా యూపీఐ ప్రస్థానం ఇప్పుడు సవాళ్లు ఎదుర్కొంటున్నదనే చెప్పాలి.


