TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకదాని వెంట మరొకటి.. డాలర్ డ్రీమ్స్ కలలు ఆవిరి.!

Published on: Sat Sep 12, 2026 2:02PM

అమెరికాలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని.. గ్రీన్‌కార్డ్‌తో తమ జీవితాల్లో స్థిరత్వం లభిస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై మళ్ళీ నల్లటి మేఘాలు అలుముకున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి కంపెనీల పురోగతికి ప్రాణం పెట్టే టెక్కీలకు.. అమెరికా డ్రీమ్ అంత తేలికగా నెరవేరేలా కనిపించడం లేదు. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు అమెరికా కార్మిక శాఖ (యూఎస్.డీఓఎల్) తీసుకున్న తాజా నిర్ణయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాగ్నిజెంట్‌కు చెందిన కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్ఎం) దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధించడంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

కంపెనీకి చెందిన హెచ్1బీ, పీఈఆర్ఎం నియామక ప్రక్రియలపై విచారణ పూర్తయ్యే వరకు కొత్త పీఈఆర్ఎం ఫైలింగ్స్ ముందుకు సాగవని తెలుస్తోంది. గ్రీన్‌కార్డ్ వైపు పడే మొదటి అడుగు 'పీఈఆర్ఎం'. ఆ తొలి అడుగే పడకుండా ఆగిపోతే తాము అమెరికాలో మరిన్ని ఏళ్లు అనిశ్చితి మధ్య గడపాల్సి వస్తుందని టెక్కీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ పన్నులు చెల్లిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ శ్రమను ధారపోస్తున్నప్పటికీ.. ప్రతి చిన్న మార్పుకూ తమ భవిష్యత్తు తలకిందులవుతుండటంపై టెక్కీల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థల సరసన నిలిచే కాగ్నిజెంట్ నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలోనే వేలాది మందికి హెచ్1బీ అనుమతులు లభించాయి. అందులో మెజారిటీ నిపుణులు భారతీయులే కావడం వల్ల ఈ తాజా పరిణామం నేరుగా వారి జీవితాలపైనే తీవ్ర ప్రభావం చూపనుంది. 

[H1B Visa Fees, IT Sector, India US Tech Pipeline, Tech Professionals, US Immigration Policy, Cognigentfraud]