రాయతీ ధరకే ఉల్లి.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.!
Published on: Sat Sep 5, 2026 1:30PM
.webp)
రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో సామాన్యుల కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధర సామాన్యుడి కిచెన్ లో మంట పెట్టకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య భాగస్వామ్యంతో ఉల్లిని రాయతీ ధరకు వినియోగదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత జరిగిన ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న నిత్యావసరాల ధరల పరిస్థితి, వాటి పెరుగుదలకు దారితీసిన వివిధ అంశాలపై ఈ సమావేశం చర్చించింది. త్వరలో రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లు, అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న విక్రయ కేంద్రాల ద్వారా కిలో ఉల్లి 35 రూపాయలకే ప్రజలకు అందించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
దీనివల్ల మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు భారీ ఊరట లభిస్తుంది. అలాగే ఉల్లితో పాటు ఇతర నిత్యావసర సరుకులైన కందిపప్పు, పామాయిల్ ధరలను కూడా అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. మార్కెట్ ధరతో పోలిస్తే పామాయిల్‌ను లీటరుకు 10 రూపాయల వరకు తక్కువ అందించాలని సబ్ కమిటీ భేటీలో మంత్రులు నిర్ణయించారు. అలాగే కందిపప్పు కొరతను నివారించేందుకు, ధరలను తగ్గించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి దాదాపు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని తీర్మానించారు. ఈ కేటాయింపులు రాగానే వాటిని ప్రాసెసింగ్ చేసి, రైతు బజార్ల ద్వారా రాయితీ రేట్లకు ప్రజలకు పంపిణీ చేయనున్నారు.
గత కొంతకాలంగా రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రత్యేక కౌంటర్లు, రైతు బజార్ల ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం విక్రయిస్తుండగా, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు నెల్లూరు ప్రాంతంలోని రైస్ మిల్లర్ల నుంచి పది వేల టన్నుల కేఎన్‌ఎం రకం బియ్యాన్ని సేకరించి ఈ కౌంటర్ల ద్వారానే మరింత మందికి అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
[AP Government Price Control, Onions at Rs 35 in Rythu Bazaars, Nadendla Manohar, AP Essential Commodities Subsidy, NCCF Onions Andhra Pradesh, Telugu One]


