బయటపడుతున్న పరిటాల కేసులో రాజకీయ కోణం..!

  తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆమె పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లు, పరిటాల శ్రీరామ్ పై నమోదుచేయబడిన హత్యాయత్నం కేసులో ఇమిడిఉన్నరాజకీయకోణం కూడా క్రమంగా బయటకోస్తోంది.   ధర్మవరం పోలీసులు, పరిటాల శ్రీరామ్ అనుచరులుగా చెప్పబడుతున్న ఆరుగురు వ్యక్తులను స్థానిక కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేసారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు పరిటాల శ్రీరామ్ పై కూడా కేసు నమోదు చేసి, అతన్నిఅరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ఆవిషయం తెలిసుకొన్నపరిటాల శ్రీరామ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, ముందస్తు బెయిలుకోసం కోర్టులో దరఖాస్తు చేసుకొన్నాడు.   పోలీసుల గాలింపు చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత మరియు వారి బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించడం వివాదాస్పదమయింది. ముఖ్యంగా ఒక మహిళా శాసనసభ్యురాలి ఇంట్లో ఆమె అనుమతి లేకుండా రాత్రిపూట పోలీసులు గాలింపు చేప్పటి ఎందుకు అంత అత్యుత్సాహం చూపారో తెలుపాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. పరిటాల సునీత పత్రికలవారితో మాట్లాడుతూ, హత్యయత్నం మీద అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా, పోలీసులు వారిని ఇంకా తమ ఆధీనంలోనే ఎందుకు ఉంచుకొన్నారు? అని ప్రశ్నించడంతో పోలీసులు కూడా జవాబు చెప్పలేకపోయారు.   అనంతపురం జిల్లాలో గత అనేక సం.లుగా పరిటాల కుటుంబము తెలుగుదేశం పార్టీకి మద్దతునిస్తూ, ఆ జిల్లాలో పార్టీకి బలమయిన పునాదివేసింది. ప్రస్తుతం హత్యాయత్నం నుండి బయటపడినట్లు చెపుతున్న కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి, కొద్దికాలంక్రితం జరిగిన సహకార సంస్థ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయాడు. తన విజయానికి తెలుగుదేశమే గండి కొట్టిందని అయన ఆరోపించినట్లు వార్తలొచ్చాయి కూడా. ఆ ఎన్నికలలో పరిటాల కుటుంబం చక్రం తిప్పడం వల్లనే తను ఓటమి చవిచూసినట్లు భావిస్తున్న సుధాకర్ రెడ్డి, పరిటాల కుటుంభాని, తెలుగుదేశం పార్టీని ద్వేషించడం సహజమే.   ఇక, కొత్తగా బరిలోకి దిగిన వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ప్రాతినిద్యం వహిస్తున్నతోపుదుర్తి ప్రకాష్ రెడ్డికూడా పరిటాల కుటుంబం తన రాజకీయ ప్రస్తానంలో ఒక అడ్డుగోడగా నిలిచినట్లు భావిస్తూ, పరిటాల కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి మద్య ఉన్న అనుబందము విడగొట్టిననాడే తనకి జిల్లాలో మనుగడ సాధ్యం అని తెలుసుకొన్నాడు. అందుకే, తనకు ప్రమేయంలేని పరిటాల కేసులో వేలు పెడుతూ ఒకనాడు పరిటాల రవిని ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ను కూడా ప్రోత్సహిస్తోందని ఆరోపించేడు. అంటే గాక పరిటాల శ్రీరామ్ తో లోకేష్ కి ఉన్న స్నేహ సంబందాల గురుంచి కూడా ప్రశ్నించేడు. తెలుగుదేశం పార్టీ రాయలసీమలో శాంతి కోరుకొంటే, ముందు పరిటాల సునీతని, ఆమె అనుచరులను పార్టీనుండి బహిష్కరించాలని డిమాండ్ చేసాడు. అంతేగాకుండా పరిటాల శ్రీరామ్ నడుపుతున్న వెబ్ సైటును కూడా వెంటనే పోలీసులు మూయించేయాలని డిమాండ్ చేసాడు.   దీనిని బట్టి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబముకు గల ప్రాముక్యత అర్ధమవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరో వైపు వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరూ కూడా తెలుగుదేశం-పరిటాల కుటుంబం మద్యన ఉన్న బలమయిన బందం తెంచగలిగినప్పుడే తమ రాజకీయ ప్రస్థానం సాధ్యమని గ్రహించి, జిల్లాలో తెలుగుదేశానికి పునాదివంటి పరిటాల కుటుంబాన్ని లక్ష్యం చేసుకొని ఆరంబించిన ప్రయత్నాలలో భాగంగానే పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్బరుద్దీన్ ఫై సర్వత్రా విమర్శలు

      ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలఫై దేశవ్యాప్త దుమారం చెలరేగుతుంది. ఎంఎల్ఏ గా ఉండి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన ఒవైసీను దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.   ఓట్ల కోసం ఇలా ప్రజలను రెచ్చగొట్టడాన్ని ఆ పార్టీలు తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్, బిజెపిలు ఎంఐఎం నేతఫై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయనఫై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఆయన ఎంఎల్ఏ గా పనికిరాడంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి. భారత దేశంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఉంటారని, ఆ వాతావరణాన్ని ఇలాంటి ప్రసంగాలు చెడగొడతాయని ఆ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.   రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి నిన్న ఓ ప్రకటన చేస్తూ, ఒవైసీఫై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లు 121, 153 A కింద ఆయన ఫై కేసులు నమోదు చేసామని, ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. లండన్ వెళ్ళినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారని, అవసరమైతే, ఆయనను అరెస్టు చేయడానికి ఇంటర్ పోల్ సహాయం తీసుకొంటామని డిజిపి తెలియచేసారు.   సెక్షన్ 121 అంటే ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం. ఏదేని రెండు వర్గాలు లేక మతాల మధ్య శత్రుత్వం సృష్టించడం సెక్షన్ 153 A కిందకు వస్తుంది.

అక్బరుద్దీన్ ఓవైసీ ఓ దేశద్రోహి...అరెస్ట్ చేయండి: పాల్వాయి

        ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఓ దేశద్రోహి అని..మతం పేరుతో వైశమ్యాలు సృష్టిస్తూ హిందూ – ముస్లింల మధ్య కలహాలు రేపేందుకు ప్రయత్నిస్తున్నాడని..అతన్ని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టాలని” కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఇటీవల పలు సభల్లో చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ సురేష్ రెడ్డి తెలిపిన వాదనే కాంగ్రెస్ వాదన అని, తెలంగాణకు కొందరు దోపిడీ దారులు తప్ప ఎవరూ అడ్డులేరని అన్నారు. రాష్ట్ర విభజనను సీమాంధ్రనేతలెవరూ వ్యతిరేకించటం లేదన్నారు. హైదరాబాద్ను శాంతి భద్రతలు వంటి అంశాలను కేంద్రపరిధిలో ఉంచుకుని ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లు అయితే సీమాంధ్రులకు అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చేంతవరకూ హైకమాండ్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు లాబీయింగ్ ఉంటుందన్నారు. పనిలో పనిగా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పాల్వాయి ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి తెలంగాణ ద్రోహి అని అన్నారు. ఓ సారి తెలంగాణ అంటాడు, మరోసారి జగన్ పార్టీలోకి వెళ్తానంటాడు అని ఆయన ఎద్దేవా చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి vs కోమటిరెడ్డి

  రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల జరుగుతున్న మాటల యుద్దాన్ని గమనిస్తే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది.   జిల్లా రాజకీయాల్లో ఎప్పటినుండో ఉన్న ముఠా పోరులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి పర్యటనతో ఒక్కసారి బాగ్గుమన్నాయి. వీరిద్దరి మధ్య వ్యక్తిగత మాటల యుద్ధం నడుస్తోంది. చిరంజీవిని, ఆయనను నల్గొండ పర్యటనకు ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ఫై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు పార్టీలు మారతారో తెలియనివాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల్లో దస్తీలు వేసుకొని ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్నవారు తనను విమర్సిస్తారా అంటూ ఉత్తమ్, కోమటిరెడ్డిఫై ఫైర్ అయ్యారు. తెలంగాణా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కూడా ఉత్తమ్ వ్యాఖ్యలు చేశారు.   మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి అంతే స్థాయిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం కోసం తాను రాజీనామా చేస్తే, ఆ స్థానంలో మంత్రి పదవి చేపట్టిన నేతలకు తన గురించి మాట్లాడే అర్హత లేదంటూ కోమటిరెడ్డి బదులిచ్చారు.   తాను పార్టీ మారనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో మాత్రం వేచి చూడాల్సిందే.

యాన్టిసిపేటరీ బెయిల్ కోసం పరిటాల శ్రీరామ్ పిటిషన్

  అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్ నేత సుధాకర్ పై గత వారం జరిగిన హత్య ప్రయత్నంలో పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పోలీసులు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు పరిటాల సునీతా కుమారుడయిన పరిటాల శ్రీరామ్ పేరును కూడా జేర్చడంతో, అతను గత మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు శాసన సభ్యురాలు పరిటాల సునీత మరియు వారి బందువుల ఇళ్ళలో కూడా సోదా చేయడం వివాదాలకు తావిచ్చింది. అయితే, పరిటాల శ్రీరామ్ కోర్టులో లొంగి పోబోతున్నట్లు అనంతపురంలో జోరుగా పుకార్లు ప్రచారం అవడంతో, మీడియా అక్కడికి జేరుకొంది. ఆ వార్త తెలిసిన పరిటాల శ్రీరామ్ సానుభూతిపరులు కూడా పెద్దఎత్తున హడావుడిగా కోర్టువద్దకు జేరుకోవడంతో ఒక్కసారిగా కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలఎత్తాయి. గానీ, కోర్టు మూసేసే సమయానికి కొద్ది నిమిషాల ముందు పరిటాల శ్రీరామ్ కు బదులు, అతని లాయర్ వచ్చి కోర్టులోఅతని తరపున యాన్టిసిపేటరీ బెయిలు పిటిషను దాఖలు చేసారు. కోర్టు ఆ పిటిషన్ పై విచారణ ఈరోజు చేపట్టవచ్చునని సమాచారం.

153 ఏ సెక్షన్ కింద అక్బరుద్దీన్ ఫై కేసు నమోదు

      రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణతో ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఫై ఢిల్లీ లో కేసు నమోదు అయింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలఫై దాడి చేసినట్లుగా ఉన్నాయంటూ శబ్మం హష్మీ అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేయడంతో ఆయనఫై ఢిల్లీ లోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.   ఈ ఫిర్యాదుఫై ఇండియన్ పీనల్ కోడ్ లోని 153 ఏ సెక్షన్ కింద పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్ ఇటీవల నిర్మల్ లో జరిగిన సభలో మాట్లాడుతూ, ముంబాయి మారణకాండ సబబేనని, అది ముస్లింల ప్రతీకార చర్య మాత్రమేనని అన్నారు. ఒక్క 15 నిమిషాల పాటు పోలీసులు పక్కకు తప్పుకొంటే, కేవలం 15 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల మంది హిందువులను ఏమి చేయగలరో తెలుస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ముస్లింలు తలచుకొంటే, చార్మినార్ ప్రాంతంలోని భాగ్య లక్ష్మి ఆలయం కూలిపోతుందని కూడా ఆయన ఆ సభలో మాట్లాడుతూ అన్నారు.   అయితే, ఆయన వ్యాఖ్యలఫై హైదరాబాద్ లో కూడా ఇప్పటికే ఓ కేసు నమోదు అయి ఉంది. అక్బరుద్దీన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో ప్రకటించింది.

చట్టానికి పేర్లు లేవు

  కేంద్రమంత్రి శశి ధరూర్ డిల్లీ అత్యాచార బాధితురాలి పేరుని ఎందుకు బహిర్గతం చేయకూడదని తన ట్వీట్టర్ మెసేజ్ లో ప్రశ్నించదమేగాకుండా, ఆ అమ్మాయి కుటుంభానికి అభ్యంతరం లేనట్లయితే ఆమె వీరోచిత పోరాటానికి చిహ్నంగా త్వరలో సవరించబోతున్న చట్టానికి ఆమెపేరునే పెడితే బాగుంటుందని కూడా ఒక సలహా వ్రాసి ప్రజలనుండి కొంత మద్దతును మరికొంత వ్యతిరేఖతను కూడా పొందారు. అయితే, అనూహ్యంగా ఆమె కుటుంబసభ్యులు సానుకూలంగా స్పందిస్తూ సవరణలు పొందుతున్న చట్టానికి తమ కుమార్తె పేరు పెడితే తమకేమి అభ్యంతరంలేదని ఈరోజు డిల్లీలో ప్రకటించేరు. వారి స్పందనచూసి కొందరు ప్రజలు కూడా ఆవిధంగా చేసినట్లయితే ఆమెకు సముచిత గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని అభిప్రాయపడ్డారు.   హోం మంత్రిత్వశాఖ వెంటనే స్పందిస్తూ భాదితురాలు తన వీరోచిత పోరాటంతో చట్టంలో పెను మార్పులకు దోహదపడినప్పటికీ, భారతీయ శిక్షాస్మృతిలో చట్టాలకు వ్యక్తులపేర్లు పెట్టె అవకాశం లేదని, రాజ్యాంగం అందుకు అనుమతించదని పేర్కొన్నారు.

సమైక్యమే అంటున్న మెగా స్టారువారు

  ఇపుడిపుడే కాంగ్రెస్ నీరు ఒంటబట్టిన్చుకొంటున్న మన మంత్రి చిరంజీవిగారు, తమ పార్టీలో అందరు నేతలు కూడా అఖిలపక్షం, తదనంతర పరిణామాల గురించి మాట్లాడేస్తూ నిత్యo మీడియాలో కనబడుతుండగా తానూ మాత్రం మడికట్టుకొని మూలాన కుర్చోవడం ఎందుకనుకున్నాడో మరేమో, నిన్న నల్గొండలో జరిగిన ఒక సభలో తనకు తోచిన అభిప్రాయం తను కూడా వ్యక్తం చేసాడు. అంతే గాకుండా, తన ప్రసంగంలో కాంగ్రెస్ సంప్రదాయ వాడుక పదాలయిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అధిష్టానం, విధేయత, క్రమశిక్షణ, కార్యకర్త వంటివన్నికూడా మద్య మద్యలో జోడించి ప్రసంగించి తనకీ రాజకీయ పరిణతి, కాంగ్రెస్ సంస్కృతి రెండూ అబ్బేయని కూడా ఋజువు చేసుకొన్నాడు.   ఇంతకీ ఆయనేమన్నాడంటే, “నేను మొదటి నుండే చెపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్న నిలిచే పార్టీ అని. మా అదిష్టానం రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఏమి కోరుకొంటున్నారో దానినే అమలు చేయబోతోంది. ఇటీవల మా అధ్యక్షురాలు సోనియాగాంధీగారిని కలిసినప్పుడు ఆమెకి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి త్వరగా సమస్యని పరిష్కరించామని కోరాను. త్వరలో ఆమె “మెజార్టీ ప్రజలకి ఆమోదమయిన నిర్ణయం” ప్రకటించుతారు. ఆమె నిర్ణయం ఏదయినా సరే విదేయత, క్రమశిక్షణ గల కార్యకర్తలగా మేమందరమూ అంగీకరిస్తాము.”   చిరంజీవి తన రాజకీయ పరిణతిని చూపించడంతో బాటు, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఆలోచనలకి అద్దం పట్టెడు తన ప్రసంగంలో. మెజారిటీ ప్రజల అభిప్రాయం అంటే సమైక్యంద్ర రాష్ట్రం అని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. అంటే, తెలంగాణా కోసం కేంద్రం ఒక అభివృద్ధి మండలినో మరో ఆలోచనో చేస్తున్నట్లు సంకేతం ఇచ్చినట్లే భావించవలసి ఉంటుంది. సీమంద్రకు చెందిన లగడపాటి, గాదె వెంకట రెడ్డి వంటి వారు రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని బల్లగుద్ది మరీ చెపుతున్న ఈతరుణంలో చిరంజీవి మాటలు వారి వాదనకి బలం చేకూర్చేవిగా ఉన్నాయి.   ఒకవేళ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు తలఎత్తక మానవు. అదే జరిగితే, ఇప్పటికే, అన్నివిధాల వెనకబడిపోయిన మన రాష్ట్రం మరింత వెంకబడిపోక తప్పదు. తద్వారా, రాష్ట్ర ప్రజల పరిస్థితులు మరింత దిగజారిపోక తప్పవు.

దమ్ముంటే ‘అఖిలం’ మినిట్స్ తెప్పించు :కడియం సవాల్

          గత నెలలో ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా విషయంలో స్పష్టత ఇవ్వలేదని కేసిఆర్ చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని తెలుగు దేశం పార్టీ నేత కడియం శ్రీహరి సవాల్ చేశారు. తమ పార్టీ వైఖరి తెలంగాణా కు అనుకూలం కాదని నిరూపిస్తే, తాను ఏ శిక్షకైనా సిద్దమని, అలా చేయలేని పక్షంలో కేసిఆర్ తగిన శిక్షకు సిద్దమా అని కడియం ప్రశ్నించారు.   అఖిల పక్ష సమవేశంలో జరిగిన దానికి తమ పార్టీ ప్రతినిధిగా వెళ్ళిన తాను సాక్షినని, దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కేసిఆర్ ఇలా మాట్లాడటం ఏమిటని ఆయన అన్నారు. ఆయనకు దమ్ముంటే, ఆ సమావేశం మినిట్స్ తెప్పించవచ్చని కడియం సవాల్ విసిరారు. అప్పుడు తమ పార్టీది స్పష్టతో, కాదో తెలిసిపోతుందని కడియం వ్యాఖ్యానించారు.   ఆ సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత తమ పార్టీ స్పష్టమైన వైఖరితో వచ్చి మాట్లాడిందని అన్ని పార్టీలు తమను ప్రశంసించాయని, అయినా కేసిఆర్ తమఫై ప్రత్యెక రాష్ట్రం విషయంలో ఎందుకు విమర్శిస్తున్నాడో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. టిడిపి తెలంగాణాకు అనుకూలమని షిండే బహిరంగంగా అన్న మాటలు కేసిఆర్ వినలేదా అని కడియం ప్రశ్నించారు.

‘టి’ విషయం తేల్చాలని ప్రణబ్ కు మంత్రుల రిక్వెస్ట్

      కాంగ్రెస్ పార్టీ తెలంగాణా విషయంలో ఓ స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోవడంతో, ఆ ప్రాంత నేతలు అధిష్టానం ఫై వత్తిడి తెచ్చేందుకు తమ సొంత మార్గాల్లో పయనిస్తున్నారు. తన హైదరాబాద్ పర్యటన చివరి రోజున రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆరుగురు రాష్ట్ర మంత్రులు బేటీ అయ్యారు.   తెలంగాణా విషయాన్ని త్వరగా తేల్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు ఆయనను కోరారు. ఈ విషయంఫై పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన చొరవ తీసుకోవాలని హోం శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతా రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ శ్రీధర బాబు, నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి సారయ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత లక్ష్మ రెడ్డి నిన్న ఆయనను బొల్లారం లో కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకొంటే, మరలా కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా వారు రాష్ట్రపతితో అన్నారు.   ఆయన మంత్రులతో మాట్లాడుతూ, ఈ విషయంలో తనకు అన్ని విషయాలు తెలుసని, త్వరలోనే నిర్ణయం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన వంతు ప్రయత్నం తాను చేస్తానని కూడా ప్రణబ్ వారికి హామీ ఇచ్చారు.

హోం మంత్రిగా సబిత విఫలం ?

            రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తన బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలం చెందారని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ఆమె నియోజక వర్గంలో ఒక విద్యార్ధినిని రేప్ చేసి హత్య చేస్తే మంత్రి కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని నాయుడు అన్నారు. ఇది ఓ హోం మంత్రి చేయాల్సిన పని కాదని ఆయన అన్నారు.   ఆమెను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రేప్ సంఘటనను నిరసిస్తూ, ఆ గ్రామస్తులు దాదాపు ఏడు గంటల పాటు ఆ ప్రాంతంలో రాస్తారాకో చేసారని, ఆ ప్రాంతం హైదరాబాద్ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ముఖ్య మంత్రి, మంత్రులెవరూ అక్కడకు వెళ్లకపోవడం దారుణమని ఆయన అన్నారు.   మహిళలఫై జరుగుతున్న దారుణాలకు దేశమంతా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్న సమయంలో కూడా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేతలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదని గాలి అన్నారు. మహిళలకు ఆత్మ రక్షణ కోర్సులు నేర్పించడానికి చర్యలు తీసుకొంటానని హోం మంత్రి తీరికగా కబుర్లు చెపుతున్నారని, అవి మొదలయ్యేనాటికి ఆమె తన పదవి కోల్పోతారని గాలి వ్యాఖ్యానించారు.

వై కాంగ్రెస్? సందిగ్దంలో రెడ్డిగారు

    తల్లి పిల్లా కాంగ్రేసులు ఏనాటికయినా ఒకటయ్యేవే అని ఒకవైపు చంద్రబాబు ఎంతగా మోత్తుకొంటున్నా అర్ధంచేసుకోలేని కొందరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్... వై... కాంగ్రెస్ అంటూ ఎటువైపు జంపింగ్ తీసుకోవాలో తెలియని సందిగ్దంలో ఒకసారిటు, ఒకసారటు దిక్కులు చూస్తున్నారు గోడ మీద పిల్లిలా. కాంగ్రెస్ ఉప్పు తింటూ వై.యస్సార్ కాంగ్రేసుకి జై కొట్టిన అనేకమందిలో ఒకడయిన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ శాసనసభ్యుడు శివప్రసాదరెడ్డి, జగన్ పార్టీ పెట్టగానే వై (?) కాంగ్రెస్ అంటూ అటువైపు పరుగులు తీసాడు. గానీ, ఆ తరువాత జగన్ జైల్లోకి వెళ్ళే పరిస్థితులు కనిపించడంతో మళ్ళీ బుద్దిగా ‘వై నాట్ కాంగ్రెస్?’ అనుకొంటూ కాంగ్రెస్ బెంచీల మీదకోచ్చేసాడు. గానీ మనసొకచోట మనువు మరోచోటా అన్నట్లున్న అతను, మద్య మద్యలో ఆ ‘వై.కాంగ్రెస్’ వైపు పక్కచూపులు చూస్తూనే ఉన్నాడు. గానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్ కత్తికట్టి అవిశ్వాసం పెట్టినప్పుడు మరేమనుకున్నడో ఏమో శివప్రసాదరెడ్డి మళ్ళీ ‘వై నాట్ కాంగ్రెస్?’ అంటూ ప్రభుత్వానికే తన మద్దతు తెలిపాడు. కొద్ది నెలలక్రితం జరిగిన ఉపఎన్నికలలో తన ‘వై కాంగ్రెస్’ భారీ విజయం సాదించడంతో ఏ కాంగ్రేసు ను నమ్ముకుంటే మంచిదో అర్ధంకాక మళ్ళీ మరోసారి సందిగ్దంలో పడ్డారు మన రెడ్డిగారు. అందుకే ఎందుకయినా మంచిదని కొంచెం రెండు కాంగ్రేసులతో రాసుకు పూసుకు తిరుగడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి, మొన్న జగన్ పార్టీ వాళ్ళు జగన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా మొదలుపెట్టిన కోటి సంతకాల సేకరణలో తానూకూడ సంతకం పెట్టి “మా జగన్ బాబుకి జై!” అని ఓ కేకేసి మళ్ళీ తన ఒరిజినల్ కాంగ్రెస్ శిబిరానికి తిరిగి వచ్చేసాడు.

పివి ని కిరణ్ ఎలా స్మరించుకొన్నారంటే....

      దివంగత ప్రధాన మంత్రి పి.వి.నరసింహా రావుకు తన తండ్రి అమర్ నాధ్ రెడ్డి నమ్మిన బంటుగా ఉండేవారని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కిరణ్ తన కుటుంబానికి పి.వి. తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.   తన వివాహానికి హాజరు కావడం కోసం ఆ సమయంలో రష్యాలో ఉన్న పి.వి. ఎంతో శ్రమకోర్చి నాలుగు విమానాలు మారి వచ్చి హాజరయ్యారని కిరణ్ గుర్తు చేసుకున్నారు. ‘1987 లో రాష్త్రపతి ఎన్నికల సమయంలో ఓ దశలో ఆ పదవికి పి.వి. పేరు పరిశీలనలోకి వచ్చింది. దీనితో, ఆయన తన తండ్రికి చేసి, తన స్వగ్రామానికి వెళ్లి ఓటర్ల జాబితా తీసుకురమ్మని చెప్పారు. ఈ విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియదు’, అని కిరణ్ అన్నారు. అంతే కాదు, తన తండ్రి మరణించినప్పుడు పి.వి. స్వయంగా పాడె మోశారని ముఖ్య మంత్రి గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న వారికి ఆయన ఏ స్థాయిలో అయినా సహాయపడేవారని కిరణ్ అన్నారు. పి.వి. తనను ముందుగా పార్లమెంట్ కు పోటీ చేయమని సలహా ఇచ్చారని, అయితే,తాను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తానని పట్టుబట్టానని ముఖ్య మంత్రి దివంగత ప్రధానితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  

శ్రీ లక్ష్మికి బెయిల్, చికిత్స కోసం సిఎంసి కి

      ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్న ఐఏఎస్ అధికారిణికి చికిత్స కోసం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆమె ఇంత వరకూ, నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. అయితే,ఆమె నొప్పి ఇంకా తగ్గకపోవడంతో తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో చికిత్స చేయించుకోవాలని కోర్టుకు విన్నవించుకొంది. ఆమె బెయిల్ పిటీషన్ ఫై వాదనలు విన్న సిబిఐ ప్రత్యెక కోర్టు న్యాయమూర్తి నిన్న ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఆమెకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన వెంటనే కోర్టులో లొంగిపోయేటట్లయితే,బెయిల్ మంజూరు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయమూర్తి శ్రీ లక్ష్మి కి సూచించి అమెనుండి హామీని తీసుకొన్న తర్వాత బెయిల్ మంజూరు చేశారు. దీనితో, ఆమె వెల్లూరు వెళ్ళడానికి అడ్డంకులు తొలగిపోయాయి.  

మంత్రుల విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరంలేదు: సిబిఐ

      జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంభందించిన కేసులో నిందితులుగా ఉన్న రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావులఫై ఉన్న అభియోగాలను అవినీతి నిరోధక చట్టం కింద విచారణ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదించింది. 2004 లో శాసన సభ్యులుగా ఉండి వీరిద్దరూ మంత్రులుగా పని చేసారని అయితే, 2009 లో ఆ అసెంబ్లీ రద్దవడంతో వారికి ప్రజా సేవకుల హోదా వర్తించదని సిబిఐ కోర్టులో వాదించింది. వారి ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని అందువల్ల వారిఫై ఉన్న అభియోగాలఫై అవినీతి నిరోధక చట్టం లోని కొన్ని సెక్షన్ల ప్రకారం విచారణకు స్వీకరించాలని సిబిఐ ప్రత్యెక కోర్టును కోరింది. గతంలో సుప్రీం కోర్టు ఆభాయ్ సింగ్ చౌతాలా కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రస్తుతం వీరి ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 4 వ తేదీకి వాయిదా వేసారు. అదే రోజు కోర్టుకు హాజరవ్వాలని కూడా న్యాయమూర్తి ధర్మాన, మోపిదేవిలను ఆదేశించారు.

ఫిబ్రవరిలోనే పెళ్లి, అంతలో........

      ఢిల్లీ లోని ఓ ప్రైవేటు బస్సులో దారుణంగా రేప్ కు గురి అయి, చివరకు మరణించిన 23 సంవత్సరాల ఆ పారా మెడికల్ స్టూడెంట్ కి వచ్చే ఫిబ్రవరి లో వివాహం జరగనుంది. వరుడు, ఆమెతో పాటు ఆగంతకుల చేతుల్లో బస్సులో దెబ్బలు తిన్న యువకుడు.   ఆమె నివసిస్తున్న ఇంటి ఇరుగుపొరుగు వారు అందించిన వివరాల ప్రకారం, తన వివాహం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పెళ్లి విందు ఢిల్లీ లోనే చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా ఆ కుటుంబం చేసుకుంది. ఆమె వివాహం ఫిబ్రవరిలో జరగనుందని మాకందరికీ తెలుసని వారు అన్నారు. రేప్ జరిగిన ఆ రోజు తన స్నేహితుడితో షాపింగ్ కు వెళ్ళిందని. అటునుండి అటు వారిద్దరూ సినిమా కు వెళ్లారని బాధితురాలి బంధువు ఒకరు అన్నారు. వివాహానికి కావాల్సిన బట్టలు కొనడానికి ఇటీవలే తమను షాపింగ్ కు తీసుకు వెళ్ళిందని ఆమె ఇంటి పొరుగు మహిళ ఒకరు మీడియా తో అన్నారు. ఆ బస్సులో ఆమె ఆ ఆరుగురు కీచకుల బారిన పడకుండా ఉండి ఉంటే, జనవరి లోనే ఆమె నిశ్చితార్ధం కూడా జరిగేది.  

జగనన్న జైలులో, నో న్యూ ఇయర్ వేడుకలు

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉండటంతో ఈ సారి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోరాదని ఆ పార్టీ అధినాయకత్వం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా నిర్భంధం లో ఉంచారని వారన్నారు.   జగన్ ను ఏడు నెలలుగా అక్రమంగా నిర్భందంలో ఉంచారని, ఆ కారణం వల్ల ఈ సారి ఆ వేడుకలను జరుపుకోరాదనేది పార్టీ సీనియర్ నాయకుల నిర్ణయమని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. జగన్ కు బెయిల్ వస్తుందని తమ పార్టీ కార్యకర్తలంతా ఇటీవల ఎదురుచూసారని, అయితే, అది రాకపోవడంతో వారంతా నిరుత్సాహం చెందారని ఆయన అన్నారు. ఈ వేడుకలకు దూరంగా ఉండి, జగన్ ను జైలులో ఉంచడానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియచేయాలని పార్టీ భావించిందని ఆయన అన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలు రెండూ కలిసి ఈ కుట్ర పన్నాయని, దీనిని ఎదుర్కొనేందుకు రేపు ప్రారంభం కానున్న ‘జగన్ కోసం జనం సంతకాలు’ ఉద్యమాన్ని ఉదృతంగా చేపట్టాలని ఆ నాయకులు కోరారు. జగన్ తన బెయిల్ కోసం ఎనిమిది సార్లు కోర్టుల్లో పిటీషన్లు వేస్తే, వాటిని దర్యాప్తు సంస్థ సిబిఐ కుట్ర పూరితంగా అడ్డుకొదని వారు ఈ సందర్భంగా అన్నారు. ఆ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈ సారి నూతన సంవత్సర సందర్భంగా మిఠాయిలు పంచడం, కేక్ లు కట్ చేయడం, దండలు స్వీకరించడం వంటివి చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు.  

టిఆర్ఎస్ లోకి కోమటి రెడ్డి ?

      తెలంగాణా రాష్ట్రం కోసం తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. ఒక వేళ పార్టీ మారాల్సి వస్తే, ప్రత్యెక రాష్ట్రం కోసం పని చేసే తెలంగాణా రాష్ట్ర సమితి వంటి పార్టీల్లోకి వెళ్తాను తప్ప జగన్ పార్టీలో మాత్రం చేరానని ఆయన అన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం ఇంత వరకూ జరిగేది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, అవి జగన్ పార్టీలోకి చేరడానికేననే ప్రచారాలు కూడా జరిగేవి. ఆయనకు వైఎస్ రాజ శేఖర రెడ్డి తో సంభందాలు బలంగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. ఆయన మృతి తర్వాత కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాను జగన్ పార్టీలోకి వెళ్లనని ఆయన చాలాసార్లు చెప్పినా ఆ ప్రచారం మాత్రం ఆగలేదు.   అయితే, తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశం తర్వాత కోమటి రెడ్డి తన అభిప్రాయాన్ని మార్చుకొన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం కోసమే తాను రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత, తెలంగాణా వాదులు నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న జగన్ పార్టీలో చేరితే ప్రజలు హర్షించరనే కారణంతోనే ఆయన టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఈ తాజా ప్రకటనతో జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.