డోలాయమానంలో టీ- కాంగ్రెస్ యంపీలు

  తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ముందు ప్రకటించినట్లుగా ఈరోజు సమావేశం కాలేకపోవడంతో వారిమధ్య ఉన్నఅభిప్రాయబేధాలు మరోమారు బయటపడ్డాయి. మిగిలినవారి సంగతెలా ఉన్నపటికీ, నిజామాబాద్ యం.పీ. మధుయాష్కి మాత్రం రాజీనామా విషయంలో ఒక స్పష్టతకొచ్చారు. అధిష్టానం తెలంగాణా అంశంపై వెనక్కి తగ్గేదిలేదని ఒక ప్రకటన చేసి, దానిపై కసరత్తు చేస్తున్న ఈ తరుణంలో రాజీనామా చేయవలసిన అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.   అయితే, కొందరు యంపీలు మాత్రం ఆయనతో విభేదిస్తూ, సమావేశాలను బహిష్కరించడం ద్వారా అధిష్టానానికి మరోమారు తమ నిరసనను తెలియజేయాలని భావిస్తున్నారు. మరి కొందరు, తెలంగాణా అంశంపై అధిష్టానం ఎలాగు కసరత్తు మొదలు పెట్టింది కనుక సమావేశాలలోయధావిదిగా పాల్గొనడం మేలని భావిస్తున్నారు.   ఇంకొందరు చర్చల ప్రక్రియతో తెలంగాణా అంశాన్నిసాగదీస్తున్నఅధిష్టానాన్ని, ఇదివరకు యఫ్.డీ.ఐ.బిల్లుపై లొంగదీసినట్లుగా ఇటువంటి కీలకసమయంలోనే సభా కార్యక్రమాలను అడ్డుకొని రభస చేయడం ద్వారా లొంగదీయవచ్చని, ఈ సదవకాశాన్ని జారవిడుచుకొంటే, మధ్యంతర ఎన్నికల ఊహాగానాల నేపద్యంలో పార్లమెంటు మరోమారు సమావేశం అవడం కూడా అనుమానమేనని, అందువల్ల ఇదే ఆఖరి అవకాశంగా భావింఛి తమ ప్రయత్నం తాము చేయడం మేలని, లేకపోతే ప్రజలలో తిరగడం కష్టమయిపోతుందని వాదిస్తున్నారు. ఇప్పుడు గనుక తెలంగాణా అంశంపై గట్టిగా పట్టుపట్టకపోతే, బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత అధిష్టానం తెలంగాణా అంశాన్నిపక్కన బెట్టేసి, ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల జరగనున్న ఎన్నికల ఏర్పాటులో తమని ఇక పట్టించుకోదని వారు వాదిస్తున్నారు.   ఈ విధమయిన విభిన్న వాదనలతో అందరూ తలో దారి పట్టడంతో ఈరోజు జరుగవలసిన సమావేశం రద్దయింది. అందరూ ఒక నిర్ణయానికి రాలేకపోవడం వలన, తెరాస, తెలంగాణా-ఐ.కాసా. వంటి వారికి చులకనయిపోతున్నామని తెలిసినా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు.

కిరణ్, బాబుల రుణానుబంధం

  తాను అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలు మీదనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు వాగ్దానాలు చేస్తుంటే, రుణమాఫీ చేయడం ఎట్టి పరిస్థితుల్లోకూడా సాద్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టినటు చెపుతున్నారు. కానీ, చంద్రబాబు ఈ రోజు కూడా తన పాదయాత్రలో రైతులు బ్రతికి బట్టకట్టాలంటే కేవలం రుణమాఫీయే మార్గం అని నొక్కి చెప్పారు. పరిశ్రమలకి, ఇతర రంగాలకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నపుడు, వ్యవసాయానికి, రైతులకు ఎందుకు సాయం చేయలేరని ప్రశ్నించారు.   ఈ రోజు డిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మీడియావారు ఈ విషయం ప్రస్తావించగా, ఆయన కొంచెం అసహనంతో రూ.1.16 లక్షల కోట్ల రుణాలను చంద్రబాబు ఏవిధంగా మాఫీ చేయలనుకొంటున్నారో కాస్త వివరిస్తే బాగుంటుందని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆపేసి ఇస్తారా లేక ఒక్క రూపాయి కేజీ బియ్యం ఆపేసి ఇస్తారా లేక పెన్షన్లు ఈయడం ఆపేసి రుణమాఫీ చేస్తారా చెప్పమంటూ ఎదురు ప్రశ్నించారు.   ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయడం కష్టంగా భావిస్తోందని, అటువంటప్పుడు చంద్రబాబు ఏవిధంగా రైతుల రుణమాఫీ చేసేస్తానని వాగ్దానాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అయినా, చంద్రబాబుకి వాగ్దానాలు చేయడం తప్ప వాటిని నిలబెట్టుకోవడం అలవాటు లేదని, అందుకే నోటికి వచ్చిన వాగ్దానాలు చేసేస్తున్నారని ఆయన విమర్శించారు.   దీనికి ప్రతిగా రేపు చంద్రబాబు మరింత ఘాటుగా జావాబు ఈయవచ్చును. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలిగితే ప్రజలలో ఆయన మాటలపై నమ్మకం ఏర్పడుతుంది. కానీ, మన రాజకీయనాయకులలో ఎవరికీ కూడా అంతమంచి అలవాటు లేదు, ఉండదు కూడా.

రైతులు బతకాలంటే రుణమాఫీయే పరిష్కారం: బాబు

        చంద్రబాబు నాయుడు 'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం రెండు వేల కిలోమీటర్ల పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రోజు అంగలకుదురులో ఎన్టీఆర్ కిషాన్ భవన్‌కు భూమిపూజ చేశారు. తాను వ్యవసాయం దండుగ అని ఎప్పుడు చెప్పలేదని, రైతుల పిల్లలు చదువుకోవాలని మాత్రమే చెప్పానని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు బతికి బట్టకట్టాలంటే రుణ మాఫీ మినహా మరే మార్గం లేదన్నారు. పరిశ్రమలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతోందని చంద్రబాబు ప్రశ్నించారు.   తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అల్మట్టి డ్యామ్ కేసులో వైయస్ కారణంగానే ఓడిపోయామన్నారు. అసమర్థుడైన బంధువును వైయస్ లాయర్‌గా పెట్టడం వల్లే అలా జరిగిందన్నారు. కాలువల్లోకి నీళ్లు రావడం లేదు. కానీ రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లొస్తున్నాయన్నారు. గడిచిన తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో 14,500 మంది ఆత్మహత్య చేసుకుంటే, గత నాలుగేళ్ళలో మరింత ఎక్కువయ్యాయని, వైఎస్ మాటలు నమ్మిన రైతులు ఇబ్బందుల్లో పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

అక్బరుద్దీన్ ఓవైసీ విడుదల

        ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యాహ్నం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కస్టడీలో ఉన్న అక్బర్‌కు శుక్రవారం కోర్టు మూడు షరతులతో బెయిల్ మంజూరు చూసిన విషయం తెలిసిందే. ఒకటి రూ. 10 వేలు, ఇద్దరు పూజీకత్తు, రెండోది పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించాలని, మూడోది నిర్మల్ రావద్దని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అక్బర్ ఆదిలాబాద్ నుంచి బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో హైదరాబాద్‌కు రానున్నారు.

600కోట్లతో సినిమా చూపించిన 'సిమ్స్' సంస్థ

        త్రివిక్రమ్ 'జులాయి' సినిమాలో ప్రజల దగ్గర నుంచి 1500కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తాడు విలన్. చివరికి ఆ డబ్బును హీరో ప్రజలు వద్దకు చేరుస్తాడు. ఆ సినిమాను చూసి ఇన్స్ స్పైర్ అయ్యారో లేదో తెలియదు కాని వైజాగ్ లో సేమ్ సీన్ రీపీట్ అయ్యింది. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు పది వేల రూపాయలు వడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల నుంచి 600 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసి సిమ్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ చెల్లించడంతో మధ్య తరగతి ప్రజలు ఎగబడి తమ వద్ద ఉన్న సొమ్ముని ఈ సంస్థలో దాచుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ యజమానులు పత్తాలేరు. అనకాపల్లి, యలమంచిలిలలోని ఈ సంస్థ కార్యాలయాలపై డిపాజిట్దారులు దాడి చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. డిపాజిట్ చేసివారి వత్తడితో అనకాపల్లిలో ఈ సంస్థ ఏజెంట్ సత్తిబాబు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చోడవరంలో సిమ్స్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, సంస్థ యజమాని సురేంద్ర గుప్త పోలీస్ ఉన్నతాధికారుల వద్ద లొంగిపోతారని చెబుతున్నారు. భాదితులకు న్యాయం చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. మరీ ఈ పేద ప్రజలకు ఏ హీరో న్యాయం  చేస్తాడో వేచి చూడాలి. 

అక్బరుద్దీన్ విడుదలకు బ్రేక్

  ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ విడుదలను కోర్ట్ నిలిపివేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కస్టడీలో ఉన్న అక్బర్‌కు కోర్టు మూడు షరతులతో బెయిల్ మంజూరు చూసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారికి అన్ని పత్రాలు అందజేయవలసి ఉండగా పాస్‌పోర్టు ఇవ్వకపోవడంతో విడుదలకు బ్రేక్ పడింది. అక్బరుద్దీన్ విడుదల ఆదేశాలను కోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. అక్బరుద్దీన్ బెయిల్ ఆర్డర్లు తీసుకు రావాల్సిన ఆయన తరఫు లాయర్లు జైలు వద్దకు రావడానికి మరో ఒకటి లేదా రెండు గంటలు పట్టే అవకాశముంది. ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటల వరకే కోర్టు పని చేస్తుంది. దీంతో అక్బరుద్దీన్ విడుదల ఈ రోజు అవుతుందా? లేదా సోమవారం అవుతుందా? అనేది తెలియరాలేదు.

చాయిస్ ఈజ్ యువర్స్: రాహుల్ గాంధీ

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ, ఈ ఏడాదిలో జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలనీ, వచ్చే ఏడాది జరగనున్నసాధారణ ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తన పార్టీని బలపరిచే ప్రయత్నంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో, పీసీసీ మరియు శాసనసభా పక్ష నాయకులతో నిన్న,ఈరోజు డిల్లీలో సమావేశమవుతున్నారు. పార్టీని పూర్తీ స్థాయిలో ప్రక్షాళించే ప్రయత్నంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.   1. ఇకనుండి పార్టీ అభ్యున్నతికి పాటుపడినవారికి సముచిత పదవులు, పార్టీకి నష్టం కలిగించేవారికి, లేదా పార్టీలో పనిచేయనివారికి శిక్షా విధానం అమలుచేయాలని భావిస్తున్నారు.   2. ఎన్నికలలో పార్టీ టికెట్స్ ఆశించేవారు తాము అందుకు అన్నివిధాల అర్హులమని తప్పనిసరిగా నిరూపించుకొనవలసి ఉంటుంది.   3. పార్టీలో వర్గాలు, ముఠా సంస్కృతిని పోషించేవారిపై క్రమశిక్షణా చర్యలు.   4.పార్టీలో నేతలు మరియు కార్యకర్తలు అందరూ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పనిచేయడం కాకుండా, పార్టీని పటిష్టపరిచే విదంగా పనిచేయాలి. అందుకు ప్రతీ సభ్యుడు తనకు తానుగా కొన్నిబాధ్యతలను, లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా పనిచేయాలి. నిరంతరంగా కొనసాగే ఈ ప్రక్రియను, ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకొకసారి పార్టీ పరిశీలించి తమ బాధ్యతలను, లక్ష్యాలను నేరవేర్చినవారికి తదనుగుణంగా పదవులు ఇచ్చి గౌరవిస్తుంది.   5. పార్టీలో నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలుజేయాలి. హద్దులు దాటినవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పనిసరి.   రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు వినడానికి చాల బాగున్నాయి. కానీ, క్రమశిక్షణ రాహిత్యానికి, విపరీతమయిన స్వేచ్చకు, ముఠాతత్వానికి అలవాటుపడి ముదిరిపోయున్న కాంగ్రెస్ నేతలను తనకనుగుణంగా మార్చుకోవడం, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవడం కన్నాచాలా కష్టమయిన విషయం అని ఆయన త్వరలోనే గ్రహించవచ్చును. ఈ పరీక్షలో ఆయన నెగ్గితే, జవజీవాలు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక సమర్దుడయిన యువనాయకుడు దొరికినట్లే భావించవచ్చును. లేదంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు సాగుతున్న దారిలోనే కుంటుకొంటూ ముందుకు సాగవలసి ఉంటుంది.

చిరుకు చిన్నల్లుడు శిరీష్ ఝలక్

        కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ భారతీయ జనతా పార్టీలో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు. శిరీష్ భరద్వాజ్ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశా ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమైన భారతీయజనతా పార్టీని ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరైతే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చునని అంటున్నారు.

రష్యాలో ఉల్క భీభత్సం: 1000మందికి గాయాలు

        అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఓ భారీ ఉల్క ఒక్కసారిగా పేలిపోయి రష్యాలో బీభత్సం సృష్టించింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 3 వేల భవనాలు, అనేక కార్లు దెబ్బతిన్నాయి. సుమారు 1000మందికి పైగా గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో 200మంది చిన్నారులున్నారు.   "జనావాసాలపై భారీ శిలలు పడనందుకు దేవుడికి కృతజ్ఞతలు'' అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. నగరంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరాను నిలిపేశారు. దాదాపు 20వేల మందితో కూడిన సహాయక బృందాలు నగరానికి చేరుకున్నాయి.   బాధితులకు సాయం చేస్తూనే మరోపక్క గ్రహశకలాలు భూమిని తాకిన మూడు ప్రదేశాలను గుర్తించాయి. రెండు శిలలు ఇక్కడి చెబార్కుల్ చెరువు సమీపంలో పడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇతర ప్రాంతాలను పరిశీలించడానికి మూడు యుద్ధ విమానాలనూ రంగంలోకి దించారు. ఉల్కాపాతం వల్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక చర్యల ముప్పును పరిశీలించడానికి ప్రత్యేక రక్షణ బృందాలను ఇక్కడకి తరలించారు. ఇక ఈ ఉల్కాపాతానికి సంబంధించిన వీడియోలను స్థానికులు కొందరు ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వినాశనం జరుగనుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఘరానా మొగుడికి ఝలక్ ఇచ్చిన ఘరానా అల్లుడు

  కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత ఆ కేసు గురించి కానీ, మళ్ళీ వారివురూ కలిసే ఆలోచనచేస్తున్నట్లు గానీ ఎక్కడా ప్రస్తావన ఎక్కడా రాలేదు. వారి కుమార్తె ‘నిర్వర్తిత’, శ్రీజ ఇద్దరూ కూడా ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.   దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు. శిరీష్ భరద్వాజ్ ఈ మద్యనే బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశః ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డ్డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమయిన భారతీయజనతా పార్టీను ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరయితే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చును. ఆయనకి అటువంటి ఆలోచన లేనట్లయితే, చార్టెడ్ ఎకౌంటెంట్ గా చాలా మంచి జీవితమే గడిపే అవకాశమే ఉంది. గానీ, వేరే ఆలోచనలు ఉన్నందునే ఆయన రాజకీయాలలోకి వచ్చిఉండవచ్చును. ఘరానా మొగుడికి ఘరానా అల్లుడు దొరికినట్లే కనిపిస్తోంది.  

1000 కిమీ లక్ష్యాన్ని చేదించనున్న ‘జగనన్నవదిలిన బాణం’

  దాదాపు రెండు నెలల క్రితం ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఈ 67 రోజుల్లో మొత్తం 972.4 కిమీ దూరం నడిచారు. కనుక, మరో రెండు రోజుల్లో ఆమె కూడా 1000 కిమీ మైలురాయిని నల్గొండ జిల్లాలో దాటనున్నారు. ఆమె ఈ నెల 18న గురజాల వద్ద గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తారు. జిల్లలో ఒకరోజు పాదయాత్ర కొనసాగించిన తరువాత, శాసన మండలి ఎన్నికల సందర్భంగా 19 సాయంత్రం నుండి 21 సాయంత్రం వరకు అమలులో ఉండే ఎన్నికల నియమావళి కారణంగా ఆమె తాత్కాలికంగా తన పాదయాత్రను ఆపవలసి ఉంటుంది. గుంటూరు జిల్లాలో దాదాపు 270కిమీ దూరం నడువనున్న ఆమె మొత్తం 13 నియోజక వర్గాలను పర్యటిస్తారు. జగనన్న వదిలిన బాణంగా తనను తానూ అభివర్ణించుకొన్న షర్మిల, ఇప్పుడు 1000కిమీ లక్ష్యం చేదించనున్నది.

సెన్సార్ బోర్డు ఎదుట విషం తాగిన డైరెక్టర్

        తాను దర్శకత్వం వహించిన సినిమాకు సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో డైరెక్టర్ దుర్గాప్రసాద్ సెన్సార్ బోర్డు ఎదుట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సినీ రంగంలో తీవ్ర కలకలం సృష్టించింది. దుర్గాప్రసాద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘లవ్ పాయిజన్' అనే చిత్రాన్ని నిర్మించారు. చాలా రోజుల క్రితం సినిమాను సెన్సార్ బోర్డ్ కు పంపించిన సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన బోర్డు కార్యాలయం ముందు ఈ రోజు విష౦ తీసుకున్నారు. ఈ విషయం గమనించిన కొందరు వెంటనే అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎట్టకేలకు అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్

        ఎట్టకేలకు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్ మంజూరైంది. గత కొద్ది రోజులుగా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఓవైసీకి బెయిల్ మంజూరు అవడంతో జైలు నుంచి విడుదల కానున్నారు. నిర్మల్ లలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న అబియోగంపై కేసులు నమోదయ్యాయి. నిర్మల్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు తొలుత నిజామాబాద్ కోర్టులో బెయిల్ లభించగా, మధ్యాహ్నానికి ఆదిలాబాద్ కోర్టులో బెయిల్ మంజూరైంది. అక్బర్ ఎట్టి పరిస్థితిలోను నిర్మల్ లో అడుగు పెట్టరాదని, పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని, పూచికత్తులు సమర్పించాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు.   

ప్రత్యేక తెలంగాణ పై రాహుల్ కి కిరణ్‌ వివరణ

        విబేధాలు విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయపథంలో నడిపించే దిశగా పనిచేయాలని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అంశంపై రాహుల్‌కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ బొత్స సత్యనారాయణ వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం జరిపిన తొలి రోజు సమావేశం ముగిసింది. 2014లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ ఈ రెండు రోజులు వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు తీసుకోవల్సిన చర్యలపై నేతలతో చర్చించి, పలు సూచనలు చేశారు. రేపు కూడా సమావేశం జరగనుంది.

వాలెంటైన్స్ డే: ప్రియుడి చేతిలో ప్రియురాలు మృతి

        బ్లేడ్ రన్నర్ అంటే క్రీడా ప్రపంచంలో తెలియని వారుండరు. రెండు కాళ్లూ లేకున్నా కృత్రిమ కాళ్లతో పరుగెత్తి ట్రాక్ పై అనేక రికార్డులు నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్ప్రింటర్ ఆస్కార్ పిస్టోరియస్ తన ప్రేయసిని కాల్చి చంపాడన్నది ఆరోపణ. ఐతే అదేమీ అతను కావాలని చేయలేదు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్ తన ప్రియుడు పిస్టోరియస్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి ఓ మాస్కు వేసుకొని వచ్చింది. ఉదయమే ఆమె ప్రియుడి ఇంటికి చేరుకుంది. కానీ, ఆ విషయం తెలియని పిస్టోరియస్ ఆమెను దొంగగా భావించి కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పోలీసులు పిస్టోరియస్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు తన ప్రియురాలిని అనుకోకుండా కాల్చినప్పటికీ అంతకుముందు అతను జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఓ టీనేజ్ అమ్మాయి పైన దాడి చేశాడు. దీనికి 2009లో ఒకరోజు జైలు శిక్ష అనుభవించాడు. పిస్టోరియస్ అందరూ అనుకునేలాంటివాడేమీ కాదని అతని మాజీ ప్రియురాలు ఓ సందర్భంగా చెప్పింది. పిస్టోరియస్ తన ప్రియురాలిని షూట్ చేసినందుకు హత్యానేరం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

యెర్నేని రాజకీయ సన్యాసం స్వీకరించారా?

  గోళ్ళూడిన సింహాన్ని చూసి జింకలు, కుందేళ్ళు కూడా భయపడవు. పదవీ, అధికారం కోల్పోయిన రాజకీయనాయకుడి పరిస్థితీ ఇంచుమించుగా అదేవిధంగా ఉంటుంది. పార్టీ పట్టించుకోదు, వీధి గుమ్మం దగ్గర తన కోసం పడిగాపులు కాసే అనుచరులు కనబడరు, శిష్యులు గురువులవుతారు, ఓడలు బళ్ళవుతాయి. పూవులమ్మిన చోటే కట్టెలమ్ముకోలేని దుస్థితిలో ఆశ్రయమిచ్చే వేరే పార్టీలకోసం కళ్ళు కాయలు కాస్తాయి. అయినా, చంచల్ గూడా జైలుకు వెళ్ళే (పార్టీ తీర్దం పుచ్చుకొనే) భాగ్యం అందరికీ దక్కదు.   మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉన్నారని చెప్పవచ్చును. మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘కొత్తనీరు వచ్చి పాత నీటిని బయటకు పంపేస్తుందని’ ఎవరిని ఉద్దేశించి అన్నపటికీ, ఆ సూత్రం యెర్నేనికి చక్కగా వర్తిస్తుంది. క్రమంగా తన అనుచరులందరూ వేరే నేతలదగ్గర సర్దుకుపోయి మొహం చూపించడం మానేసిన తరువాత, ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారు పైకెదిగి ఆయనను పట్టించుకోక, ఏకులయివచ్చిన స్థానిక నాయకులూ క్రమంగా మేకులయి తన ఓటమికి కారకులయినపుడు, ఇటు రాష్ట్రంలోగానీ, అటు కేంద్రంలోగానీ తన మోర వినే నాధుడు లేకపోవడంతో, వైరాగ్యం కమ్ముకొన్న యెర్నేని గతకొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా, అజ్ఞాతంలో గడుపుతున్నారు.   నిత్యం సంచలన వ్యాఖ్యలతో మీడియాలో కనిపించే ఆయన ఒక్కసారిగా నిశబ్ధం అయిపోయారు. కనీసం ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో సైతం ఆయన జాడ కనిపించకపోవడంతో ఆయన స్వంత పార్టీవారే ఆశ్చర్యపోయారు.   ఒకనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుగాంచిన యెర్నేని కటాక్ష వీక్షణాలకోసం పడిగాపులు కాసినవాళ్ళే, నేడు ఆయనను పరిహసించే సాహసం చేస్తున్నారంటే ఆయన పరిస్థితి అర్ధం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్-చార్జ్ గా చక్రం తిప్పిన యెర్నేనిని, ఒకవైపు పిన్నమనేని, మరోవైపు కావూరి వర్గీయులు కలిసి వ్యూహాత్మకంగా ఆయన పరిధిని కుచించివేసి, పార్టీలో జిల్లాలో క్రమంగా ఆయన ప్రాబల్యం తగ్గించడంలో సఫలీకృతం అయ్యారు.   ఇందిరమ్మ గృహాల మంజూరుకు ఇన్చార్జిగా ఉన్న యెర్నేనిని ఆ పదవి నుండి తప్పించగలిగారు. ఆ తరువాత కైకలూరు మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవి కేటాయింపులోను ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. కనీసం మండలాల ఇన్చార్జి బాధ్యతలనయినా తన అధీనంలో ఉంచుకొందామనుకొన్న యెర్నేని చేతిలోంచి అదీ లాక్కొని, మాజీ జడ్పీటీసీ సభ్యులకే ఆయా మండలాల బాధ్యతలు అప్పగించడంతో ఆయన హతాశుడయ్యారు.   ఇవి చాలవన్నట్లు దొంగ మెడికల్ బిల్లులు పెట్టిన పాపానికి కోర్టు కేసులు తలకు చుట్టుకోన్నాయి. ఆయన తప్పయిపోయింది క్షమించందని ప్రాధేయపడినా కోర్టు కనికరించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయిన యెర్నేని రాజకీయాలు చెడిపోయాయి, నమ్మినవారు మోసంచేస్తున్నారు అంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.   అయితే, వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించుకొనేందుకు ఆయన ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని, అటువైపు నుండి సరయిన ఆఫర్ వస్తే, అయన కూడా చంచల్ గూడా జైలు బాట పట్టడం ఖాయం అని పార్టీలో ఆయన వ్యతిరేఖ వర్గం వారు జోస్యం చెపుతున్నారు. ఇక, యెర్నేని జైలుకి వెళ్తారా లేక (రాజకీయ) సన్యాసం స్వీకరిస్తారా అనేది త్వరలో తేలిపోవచ్చును.  

వైయస్ జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే సాయిరాజ్

      శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇచ్ఛాపురం శాసనసభ్యుడు సాయిరాజ్ జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని ఈ రోజు టిడిపి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ ములాకత్ సమయంలో కలిశారు. సాయిరాజ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ రావు, ఇచ్ఛాపురం టిడిపి ఇంఛార్జ్ వెంకటరమణలు కూడా జగన్ ని కలిశారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి సమక్షంలో సాయిరాజ్ వైఎస్ఆర్ సీపీలో తీర్థం పుచ్చుకోనున్నారు. ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే సాయిరాజ్ చిత్రమైన కధ చెప్పారు.తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించిన తర్వాత తాను రాజకీయంగా ఇబ్బందిలో పడ్డానని, పార్టీ పరిస్థితులు మారిపోయి, తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు.

లోగుట్టు పెరుమాళ్ళకే కాదు నాకూ ఎరుకే...

  సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు, పార్టీ అధిష్టానానికి ఏకరువు పెట్టడం చూసినవారికి, పార్టీలకతీతంగా సాగవలసిన సహకార ఎన్నికలు రాజకీయ నాయకుల కనుసన్నలలో ఏవిధంగా జరిగాయో కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.   రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో వేలు పెట్టడమే ఒక తప్పనుకొంటే, వాటి మద్య పోరాటాలు, పొత్తులు మరో తప్పు. ఇవి చాలవన్నట్లు, ఒకే పార్టీలో మళ్ళీ రెండుమూడు వర్గాలుగా చీలిపోయి, డీసీసీబీ బోర్డు పదవులు, అధ్యక్షపదవుల కోసం లోపాయికారీ రాజకీయాలు చేసుకుపోతున్నారు. తనకు దక్కకపోయినా పరువలేదు కానీ, పార్టీలో తన ప్రత్యర్ధికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పదవులు దక్కకూడదనే పంతంతో కొందరు కోర్టులకి వెళ్లి స్టేలు తెచ్చుకొంటే, మరి కొంత మంది విపక్షాలతో చేతులు కలిపి తమ పార్టీ అభ్యర్డులకే ఎసరు పెడుతున్నారు.   మొన్న కంచికచర్ల మండలం, గొట్టుముక్కల గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గుదే వెంకటేశ్వరరావు (బుజ్జి) నివాసంలో జరిగిన వేడుకల్లో, మంత్రి సారధికి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుకు మద్య నడిచిన ఈ సంభాషణ ఇటువంటి వాటికి ఒక చిన్నఉదాహరణ మాత్రమే.   మంత్రి సారధి: ఏమన్నా బాగున్నావా?   వసంత: ఆ.. ఏం బాగో.. ఒక పక్క నా ఐతవరం సొసైటీకి స్టే తీసుకువచ్చి, నన్ను ఎన్నికల్లో నిలబడకుండా చేసి, ఇప్పుడు బాగున్నావా అని అడగం వెటకారం కాకపొతే మేరేమిటి?   మంత్రి సారధి: అన్నా, నువ్వలా అనుకోమాకు. స్టే సంగతి నాకు నిజంగా తెలియదు. వేరెవరో తెచ్చి ఉంటారు.   వసంత: పిన్నమనేని వెంకటేశ్వరరావు నాకంతా చెప్పాడు. పోనీ, నీకు తెలియదని తినే ఈ భోజనం మీద ప్రమాణం చేసి చెపుతావా?   మంత్రి పార్ధ సారధి: కొంచెం అసహనంగా కదిలారు గానీ జవాబీయలేదు.   వసంత: అన్నా! మీరు పెద్దవాళ్లు. మమ్మల్ని ఆశీర్వదించాలి, కాని ఇలాగ శపించకూడదు.   ఇదొక చిన్న సొసైటీ కధ మాత్రమమే. ఇటువంటివి రాష్ట్రంలో చాలానే కుమ్ములాటల కధలు, జరిగాయి.

బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?

    టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గత ఐదు నెలలుగా ఎండనక వాననక తీవ్ర ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే పార్టీకి పునర్వైభవం తేవాలని పాదయాత్రలు చేస్తుంటే, చంచల్ గూడా జైల్లో కూర్చొన్న జగన్ మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను, నాయకులనూ జైలు బాట పట్టిస్తున్నారు.   నిన్న తెదేపా శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చంచల్ గూడా జైలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోగా, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెదేపా శాసనసభ్యుడు సాయి రాజ్, పాతపట్నం మాజీ శాసన సభ్యుడు కలమట మోహన్ రావు, ఆయన కుమారుడు వెంకట రమణ కూడా చంచల్ గూడా జైలుకి వెళ్లనున్నారు. ఈతంతు ముగిసిన తరువాత వారు నేరుగా విజయమ్మ దర్శనం చేసుకొని, పార్టీ కండువా కప్పుకోవాలని బయలుదేరుతున్నారు.   వీరికి జతగా విశాఖ జిల్లా భీమిలిపట్నం తెదేపా ఇన్-చార్జ్ ఆంజనేయులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంపింగు ఇచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక నేతల వెనుక, తోకలవంటి వారి అనుచరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతారని ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.   తెదేపాకు శ్రీకాకుళం జిల్లాలో పెద్దన్నగా నిలబడిన కింజారపు ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. రాజకీయాలలోబొత్తిగా అనుభవం లేని ఆయన కుమారుడు రామ్ మోహన్ నాయుడిని ఆయన రాజకీయ వారసుడిగా పార్టీ ప్రకటించడం కూడా, బహుశః జిల్లా నేతలకి రుచించకపోవడం వల్లకూడా ఈ పరిణామాలు కలిగి ఉండవచ్చును.   కానీ, ఇప్పుడే ఇంత జోరుగా సాగుతున్న ఈ వలసలను చూస్తుంటే, రేపు ఎన్నికలు ప్రకటించిన తరువాత వలసలు మరెంత జోరుగా సాగుతాయో ఊహించుకోవచ్చును. అందువల్ల, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పాదయాత్ర మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక పద్దతిగా ముందుకు సాగిపోయినట్లయితే, వెనక నుండి ఆయన పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం. కనుక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది.