Read more!

అమ్మా.. విజయమ్మా.. బతికిపోయావమ్మా!

నమస్తే విజయమ్మా... అమెరికా ప్రయాణం బాగా జరిగిందా?  ఏంటోనమ్మా ఈ అనుకోని ప్రయాణం. మీతోపాటు ఆంధ్రప్రదేశ్  ప్రజలెవరూ ఈ త్రిప్పటని ఊహించలేకపోయారు. సాధారణంగా ఉగాది రోజున రాశి ఫలాలు చదువుతున్నప్పుడు  ఊహించని ప్రయాణాలను త్రిప్పట అనే పదంతో  పేర్కొనడం కనిపిస్తూ వుంటుంది. అదేంటో, నీకు ఉగాది రోజనే  ఈ  త్రిప్పట  ఏర్పడింది.

ఇవాళో రేపో షర్మిలమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటావని అందరూ అనుకుంటున్న సమయంలో ఇది ఊహించని పరిణామమేనమ్మా. నీ మద్దతు  మొదటి నుంచి షర్మిలమ్మకి వుంది. నీ ఆశీస్సులతోనే షర్మిలమ్మ జగనన్నకి వ్యతిరేకంగా ముందడుగు వేసింది.  ఇప్పుడు జగనన్న మీద పూర్తి స్థాయి పోరాటానికి పాపం  ఆడపిల్ల సిద్ధమైన వేళ కన్నతల్లివైన నువ్వు తోడుగా  లేకపోవడం ఎంత లోటో నీకూ తెలుసు. అయినా ఏం చేస్తాంలేమ్మా.. ఇటు అమాయకపు కూతురు.. అటు  ఆరితేరిపోయిన కొడుకు. నీ మనసులో ఇటు వెళ్ళాలని  వున్నా, అటు వున్న వ్యక్తి ఊరుకోని పరిస్థితి. అమ్మ ఎవరికైనా  అమ్మ అంటారు. నువ్వు మాత్రం ఇప్పుడు అమెరికా  ప్రయాణానికి ఒప్పుకోవడం ద్వారా జగన్‌కి మాత్రమే అమ్మ అని  అందరూ అనుకునే అవకాశం ఇచ్చావు కదమ్మా.  విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, కడపలో పోటీ  చేస్తున్న మన షర్మిలమ్మకి అనుకూలంగా ప్రచారం చేయాలని  నువ్వు అనుకున్నావంటగా? దానికి జగనన్న నీ మీద  సీరియస్ అయ్యాడంటగా? నువ్వు వైసీపీకి ప్రచారం  చేయాల్సిందేనని పట్టు పట్టాడంటగా? నువ్వు ఏం చేయాలో  అర్థం కాని పరిస్థితిలో వుండగా, నువ్వు నాకు ప్రచారం  చేయొద్దు, షర్మిలకు ప్రచారం చేయొద్దు మధ్యే మార్గంగా  అమెరికా వెళ్ళిపో అనే ఆఫర్ జగనన్న తేవడంతో ఇక చేసేదేమీ  లేక అమెరికా బాట పట్టావంటగా?

అంతేలేమ్మ... నువ్వు మాత్రం ఏం చేయగలవ్? కొడుకు, కూతురు మధ్య  నలిగిపోకుండా అమెరికా వెళ్ళి బతికిపోయావ్. ఇక్కడే వుంటే ఇద్దరి మధ్య పోరాటం చూసి ఇంకా బాధపడాల్సి వచ్చేది.   సరేలే, ఎలాగూ ఎండాకాలం.. చక్కగా ఎలక్షన్లు అయ్యే వరకు  అమెరికాలోనే చల్లగా వుండమ్మా. ఎలక్షన్లు పూర్తయిన తర్వాత  ఇక్కడ ఎలాగూ ప్రభుత్వం మారిపోతుంది. వర్షాలు కూడా  మొదలవుతాయి. అప్పుడు చల్లటి ఆంధ్రప్రదేశ్‌లోకి హాయిగా  రావమ్మా విజయమ్మా!