Read more!

బాబును కలిసిన కోడికత్తి శ్రీను.. కూటమి విజయం కోసం పాటుపడతానని వెల్లడి

జగన్ బాధితులంతా బయటకు వస్తున్నారు. జగన్ అరాచకాలను, ఆయన హయాంలో తమకు ఎదురైన వైధింపులను బహిర్గతం చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య విషయంలో జగన్ తీరును, నిందితులకు మద్దతుగా ఆయన చేసిన అధికార దుర్వినియోగాన్ని ఇప్పటికే వివేకా కుమార్తె సునీత, జగన్ స్వంత చెల్లెలు షర్మిల ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. ఇప్పుడు ఇక కోడి కత్తి శ్రీను కూడా బయటకు వచ్చారు. గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలలో సంభవించిన అతి పెద్ద ట్విస్టులలో కోడికత్తి కేసు కూడా ఒకటి. కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందన్నది పక్కన పెడితే.. ఈ దాడిని సానుభూతిగా మలచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో  సక్సెస్ అయ్యారు. ఈ కేసు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మెడకి చుట్టాలని యత్నించి అప్పటి సీఎం చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కలిసి కుట్ర పన్ని జగన్ పై హత్యాయత్నం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ దాడి వెనక ఎవరున్నారో తేల్చాలని వైసీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు.ఈ కేసులో నిందితుడు కోడి కత్తి శీను దోషా.. లేక అసలు కుట్ర దారులు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా తేల్చలేదు. 

ఈ కేసులో   ఐదేళ్లు  శీను జైల్లోనే మగ్గాడు. కోర్టు ఈ కేసు విచారణకి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే జైల్లోనే శ్రీను నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆ మధ్య  అతని లాయర్ ప్రకటించారు. దీంతో ఈ కేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకుంటుందని, అసలు దోషులు ఎవరో తేలిపోతారనీ అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా కేసు విచారణను  విశాఖకు మార్చారు.  దాదాపు అదే సమయంలో ఈ కేసులో  జగన్‌  రెండు పిటిషన్లను దాఖలు చేశారు. కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషన్‌ను నియమించడం గానీ, వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా విచారించాలని రెండో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుడు శ్రీనుకి బెయిల్‌ ఇవ్వకూడదని ఎన్ఐఏ మరో పిటిషన్ దాఖలు చేసింది.

  దాడి జరిగి ఐదేళ్లయినా కేసు విచారణ ఇంకా నత్తకి మేనత్తలానే సాగింది.  కేసు విచారణను పూర్తిచేసి ఆధారాలుంటే నిందితుడికి శిక్ష వేయాలి.. లేదా సరైన ఆధారాలు లేవని అనుకుంటే నిర్దోషిగా విడుదలైనా చేయాలి. ఒకవేళ రెండూ కూడా బాగా ఆలస్యమవుతుందని అనుకుంటే కనీసం నిందితుడికి బెయిల్ అయినా ఇచ్చి విచారణ కొనసాగించాలి. కానీ, ఈ కేసులో అవేమీ లేవు. వైఎస్ జగన్ కేసు విచారణకి హాజరు కావడం లేదు. ఈ కేసు విచారణ పూర్తి కాకూడదన్న ఉద్దేశంతో  తెర వెనక శక్తులు పనిచేస్తున్నాయని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఒకవైపు  వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపిన కేసులో నిందితులుగా, కుట్ర దారులగా సీబీఐ పేర్కొన్న వారు బెయిల్ మీద దర్జాగా బయట తిరుగుతుంటే.. కత్తి చేతి మీద గీసిన కోడి కత్తి  కేసులో నిందితుడిని ఐదేళ్లు   మగ్గడం విశేషం. కోడికత్తి నిందితుడు బయటకొస్తే సమాజానికి మంచిది కాదని భావిస్తే.. ఇక వివేకా హత్యకేసు నిందితులకు బయట తిరిగే హక్కు ఎక్కడ ఉంది?అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. సరే ఎలాగైతేనేం కోడి కత్తి శీనుకు విశాఖ ఎన్ఐఏ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే కేసు విచారణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అది పక్కన పెడితే..

ఇప్పుడు ఎన్నికల వేళ జగన్ బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను బాహాటంగా చెబుతున్నారు. వివేకా హత్య కేసు విషయంలో ఇప్పటికే డాక్టర్ సునీత, షర్మిలలు నేరుగా అవినాష్ రెడ్డిని వేలెత్తి చూపుతూ.. అటువంటి వ్యక్తికి మద్దతుగా నిలిచిన జగన్ ను ఓడించాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. కోడికత్తి శీను కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అంబాజీపేట ప్రజా గళం సభలో న్యాయవాది గుణ్ణం వీర వెంకట సత్య నారాయణ సహకారంతో శ్రీను బాబును కలిశారు. సభా వేదిక హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబుతో కోడి కత్తి శ్రీను భేటీ అయ్యారు.

కోడి కత్తి కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ తరువాత శ్రీను తల్లి సావిత్రి తెలిపారు. కాగా, కోనసీమ ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కూడా బాబుకు వివరించినట్లు శ్రీను తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం  కూటమి విజయానికి  తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని కోడికత్తి శ్రీను మీడియాతో చెప్పారు. జగన్ విజయం కోసం, ఆయనకు సానుభూతి వస్తుందన్న ఉద్దేశంతోనే తాను ఆ నాడు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై ఉత్తుత్తి దాడి చేశానని విచారణ సందర్భంగా కోడికత్తి శ్రీను చెప్పిన సంగతి తెలిసిందే.