Read more!

మ‌నిషిగా పుట్టాక‌.. సీఎం జ‌గ‌న్ బండ‌బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

సీఎం జ‌గ‌న్‌రెడ్డి వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే మామూలుగా తిట్ట‌లేదు. ఓ రేంజ్‌లో తిట్టేశారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీలు, చెప్పిన మాట‌లు, చేస్తున్న ప‌నులు.. అన్నిటినీ గుర్తు చేస్తూ.. నోటికొచ్చిన‌ట్టు కుమ్మేశారు. ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఏపీలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇంత‌కీ జ‌గ‌న్‌రెడ్డిని తిట్ల‌తో చెడామడా వాయించేసింది మ‌రెవ‌రో కాదు.. తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. 

పెద్దారెడ్డి గురించి తెలుసుగా. తాడిప‌త్రి తోపునంటూ నిత్యం జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై విరుచుకుప‌డే ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌. వైసీపీ ఎమ్మెల్యే కావ‌డంతో.. అధికార బ‌లంతో.. ప్ర‌త్య‌ర్థులను క‌వ్విస్తూ.. ఇంటికొచ్చి తొడ‌గొడుతూ.. అగ్గికుంప‌టి రాజేస్తుంటారు. త‌న స్థాయికి జేసీ స‌రిపోర‌నుకున్నారో ఏమో.. తాజాగా నేరుగా సీఎం జ‌గ‌న్‌రెడ్డిపైనే నోరు పారేసుకున్నారు. త‌న‌దైన స్టైల్‌లో సొంత‌పార్టీ అధినేత‌నే ఏకిపారేశారు.. ఇంత‌కీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏమ‌న్నారంటే...

‘జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ.. ప్రజలను మోసపుచ్చుకుంటూ బతకడం మంచిది కాదన్నారు. మనిషిగా పుట్టాక అంతో, ఇంతో సహాయం చేయాలని, అలాంటి గుణం లేనప్పుడు ఎవరి పరిధిలో వారుండాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయ లబ్ధికోసం ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారంటూ కేతిరెడ్డి ఘాటైన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

తాడిపత్రి నియోజక వర్గంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ప్రతిపక్షాలను విమర్శిస్తూ.. సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మెల్యే నోరుజారి జ‌గ‌న్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డి వర్గీయులు క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట‌లు రికార్డ్ అవ‌డం.. అవి వైర‌ల్‌గా మార‌డంతో.. పెద్దారెడ్డి తీరు వైసీపీలో, ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. జ‌గ‌న్ తీరును త‌ప్పుబ‌డుతూ సొంత‌పార్టీ ఎమ్మెల్యేలు తిడుతుండ‌టం ప్ర‌కంప‌ణ‌లు రేపుతోంది.